Wednesday, March 8, 2017

ARYABHARATI

Ambrosia's blessings showers
Raptures thy life in all the moments;
You are the lovable ilk of noble ink ,
Aroma is life throughout in  ...
Bharathiya sanatana dharma's
Hellio's sanguinary orbs' radiance;
Aurum is your smile as auricula in dawn
Relishes the world on  Muse's Swan ;
Always in all  the ways you fly in
Truimph's glorious mellow  hails  on
Indeed  a real INDIAN ...

Saturday, May 7, 2016

happy mother`s day




జగమంతా వెలుగుని పంచే సూర్యుని జీవం నీవమ్మా
మా రాముడి మారాం పెంచిన జాబిలి చలవే నీదమ్మా
నీ ఒడిలోనే ఊయలలూగెను ఈ బాల్యం
నీ జోలలలో దీవెనలే కద మా భాగ్యం
కనిపించు దైవమే కనిపెంచు అమ్మగా
శిరసొంచి మొక్కుదాం ప్రతి అమ్మ బ్రహ్మగా ....
చరణం 1
చిన్నిచిన్ని మా అల్లరి పనులకి కసురుకునే అమ్మ
చిన్నిక్రిష్ణుడే తనకు పిల్లడని మురిసిపోవునమ్మా
ప్రాణధారనే పాలగ పంచి బ్రతుకునిచ్చెనమ్మ
అమ్మ ఋణాన్ని తీర్చడానికి చాలదు ఏ జన్మా ...
కనిపించు దైవమే కనిపెంచు అమ్మగా
శిరసొంచి మొక్కుదాం ప్రతి అమ్మ బ్రహ్మగా ....
పల్లవి 2 :
మదినిండా నిధులే నిండిన సాగర హృదయం మా నాన్న
ప్రతికలనీ ఒడ్డెక్కించే వడిగల అల ఒడి మా నాన్న
నీ సాయంతో నడకలు నేర్చెను ఈ బుడత
నీ ధైర్యంతో జగతిని గెలిచే మా భవిత
నడయాడు దైవమే నడిపించు నాన్నగా
మనసార మొక్కుదాం శిరసొంచి ప్రేమగా
చరణం 2
` కన్నా ! నీకన్నా ఎవ్వరు లోకంలో మిన్న ' అని
వెన్నుతట్టడా ఓటమి అంచున నేనుంటే నాన్న
ముందొక లక్ష్యం వెంటే విజయం ఈ జీవన పయనం
నాన్న స్పూర్తిగా సాగే పయనం అడుగడుగున ధన్యం
నడయాడు దైవమే నడిపించు నాన్నగా
మనసార మొక్కుదాం శిరసొంచి ప్రేమగా

LYRIC ; SRIACHALLA
instantly COMPOSED and SUNG BY : Prof.B V BABU

Monday, July 13, 2015

మరు జన్మ మనకుంటె ఈ మట్టి ఒడిలోన పలు జన్మలెత్తాలి రా ...



పల్లవి :
దేశం మనదేశం మనదేశం భరత దేశం
దేశం మనదేశం మనదేశం భరత దేశం
మన ప్రాణమైనదీదేశం జన ప్రణవమైనదీ దేశం 
మన ప్రాణమైనదీదేశం జన ప్రణవమైనదీ దేశం 
మరు జన్మ మనకుంటె  ఈ మట్టి ఒడిలోన 
పలు జన్మలెత్తాలి  రా ... 
దేశం మనదేశం మనదేశం భరత దేశం
దేశం మనదేశం మనదేశం భరత దేశం
చరణం :
వేద స్మృతికి జన్మను యిచ్చిన దివ్య ధాత్రి ఈ దేశం 
వేల సిరులు జగతికి  పంచిన  ధన్య ధాత్రి మన దేశం 
వేద స్మృతికి జన్మను యిచ్చిన దివ్య ధాత్రి ఈ దేశం 
వేల సిరులు జగతికి  పంచిన  ధన్య ధాత్రి మన దేశం 
మంచు నగం  మంచి తనమై  గగన తలం తాకే దేశం 
మంచు నగం  మంచి తనమై  గగన తలం తాకే దేశం 
త్రిమూర్తి స్వరూపం లా సాగరాలు సాకే దేశం 
చరణం :
జనగణమన స్వరముల శృతిలో జనముల పాలించే దేశం 
మువ్వన్నెల పతాక దృతిలో ముజ్జగాలనేలే దేశం 
జనగణమన స్వరముల శృతిలో జనముల పాలించే దేశం 
మువ్వన్నెల పతాక దృతిలో ముజ్జగాలనేలే దేశం 
మానవ విలువల పరిరక్షణనే శ్వాసించే ఘన రాజ్యాంగం 
దుష్టుల పాలిట జ్వాలానేత్రమె దేశపు న్యాయం చట్టం . . . 

స్వర కల్పన : కిరణ్ కుమార్ 





Saturday, August 3, 2013

మృత్యుం (న) చమే ....

     


   జీవితం సుందరమైన , సుమధురమైన అనుక్షణం ఆస్వాదయోగ్యమైన ఓ స్వప్నం .
మరణం - భయంకరమైన బాధాకరమైన కోరి ఆహ్వానించ  తగని ఓ సత్యం  ! 
ఈ మద్య  ఓ కాఫీ సాయంత్రం ఓ మిత్రుడి నుంచి ఫోను - ` అమ్మ పోయింది పావుగంట అయ్యింది ' అని . అతని గుండెల్లో బాధ నాకు తెలుసు , గొంతులో చిన్న రిలీఫ్ కూడా తెలుస్తోంది . మరో పావుగంటలో అతడి దగ్గర వున్నాను . జేబులో పర్స్ , చేతిలో సెల్లూ మరచిపోకపోవడం  నా ప్లానింగ్ కి నిదర్శనం కాదు , అనుబంధాలపై అవసరాలు చెలాయించే పెత్తనానికి ఓ ఋజువు మాత్రమే .నేను వెళ్ళే సరికి కుటుంబసభ్యులు తొమ్మండుగురు కాక - చుట్టుపక్కల యిళ్ళ వాళ్ళు కొద్దిమంది వున్నారు . ఎక్కాడా ఏడుపులూ పెడబొబ్బలూ లేవు . ఎనభై ఏళ్ళు దాటాక కేవలం కొద్ది గంటలు మాత్రం ఆస్పత్రిలో వుండి కన్నుమూసిన ఆవిడ జీవితపు నిష్క్రమణ క్షణాలలో నిశ్శబ్దంగా ప్రార్దిస్తున్నారు . అందరి హృదయాలలోనూ బాధ వుంది , ఆ వయసులో ఎక్కువ యాతన పడకుండా సునాయాస మరణాన్ని పొందగలిగిన అదృష్టం పట్ల కాస్త రిలీఫ్ వుంది . ఆవిడ రామాయణ , భారత భాగవతాలు, భగవద్గీత , ప్రతీ రోజూ తెలుగు పేపరూ తప్ప ఏమీ చదువుకోలేదు . ఓ మద్య తరగతి కుటుంబంలో స్త్రీ అనుభవించే అన్ని రకాల కష్టాలనీ చాలా సహనంతో నేర్పుతో అధిగమించింది . పిల్లలనీ మనవలనీ కనీసపు సౌఖ్యాలతో ప్రశాంతంగా గౌరవంగా బ్రతకగలిగేలా ముఖ్యంగా వారిచుట్టూ వుండే సమాజానికి వీలైనంత ఉపయోగపడేలా తీర్చిదిద్దింది . మరణానికి ఒక్కరోజు ముందు పేపర్ లో నేత్రదానానికి సంబంధించిన వార్త చూసి  ` నేను పోయాక నా కళ్ళు ఎవరికయినా యిచ్చేసే ఏర్పాటు చేయి నాయనా ' అని కొడుక్కి చెప్పింది . నేను వెళ్ళిన మరో మూడు గంటలలో ఆ కార్యక్రమాన్నీ పూర్తి చేయగలిగేం . ఈ పాటికి ఆ కళ్ళు మళ్ళీ ఈ లోకాన్ని చూస్తూనే వుండి వుంటాయి . పెద్ద కొడుకు పెళ్ళయిన అతికొద్ది రోజులలోనే ఏదో ప్రమాదంలో మరణిస్తే ...పదహారురోజుల పండుగయినా కాని కొత్త కోడలిని రాచిరంపాన పెట్టి కడుపున పెట్టుకోలేదు , కడుపులో పెట్టుకుని చూసుకుంది . కొన్నాళ్ళ తర్వాత భర్త మరణించినా మిగిలిన పిల్లల్నీ మనవల్నీ తీర్చిదిద్దడంలో ప్రదానపాత్ర తానే అయింది . మృత్యువే తనకు తానుగా వచ్చి  దేహీ అన్నప్పుడు సాఫల్యమైన జీవితపు పరిపూర్ణ పాత్రని ఆమె ముందుంచి నిశ్శబ్ధంగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది , గమనించండి మృత్యువుని స్వయంగా ఆహ్వానించి కాదు . యిది సగటు మనిషి మరణానికి ఓ సుందరమైన పార్శ్వ్యం , జీవితానికి ఓ సాఫల్యమైన ముగింపు . 
కానీ అన్ని మరణాలూ ఒకే పార్శ్వ్యంతో వుండవు  ... అన్ని జీవితాలకీ ముగింపు ఒకేలా వుండదు . సుమారు యిదే సమయంలో పత్రికలలో ... విదేశాలలో చదువుకుని ముంబై లో స్థిరపడి భారత దేశపు అగ్రశ్రేణి కధానాయకుడి సరసన మొదటి సినిమాలోనే అవకాశాన్ని చేజిక్కించుకుని అపురూపమైన విజయాన్నీ చవిచూసిన ఓ నటి స్వీయ మరణ వార్త ....నాకెందుకో క్లియోపాత్రాని గుర్తు తెచ్చింది . సర్వాంగ సుందరంగా అలంకరించుకుని పాము చేత కాటు వేయించుకుని మరణించబోయే క్షణంలో " ....The stroke of death is as lover's pinch / which hurts and is desired .."  అనుకున్న క్లియోపాత్రా . ప్రతీ ప్రేమ కథకీ ముగింపు విషాదమే ... అన్నారో సినీ కవి కాకపోతే కొన్ని ప్రేమకథలు పెళ్ళితో కూడా ముగుస్తాయి అదింకా విషాదం అంటాడో మిత్రుడు కాసింత సర్కాస్టిక్ గా . యిరవైయవ శతాబ్ధపు చిత్రకారులలో ప్రపంచంలో అగ్రగామిగా ' క్యూబిజం ' కి ఆద్యుడిగా ప్రసిద్దిగాంచిన పికాసో వెర్రి మొర్రి చేష్టలనీ చిత్రహింసలనీ భరించలేక ఆయన నలుగురి భార్యలలో ఒకరైన వాల్టర్ ఆత్మహత్య చేసుకుంది , మరో భార్య జాక్విలిల్రొక్ రివాల్వర్ తో కాల్చుకుని చచ్చిపోయింది .మిగతా భార్యలూ ప్రియురాళ్ళ సంగతి భగవంతుడి కెరుక . 
మనం చరిత్ర పాఠాలు నేర్చుకుంటాం కానీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోం .
కేవలం గత సంవత్సరం అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలోనే  నలభై అయిదువేల మందికి పైగా మహిళలు ఆత్మ హత్య చేసుకున్నారు . సగటున రోజుకి నూట యిరవి తొమ్మిది మంది మహిళలు . వ్యక్తిగత కారణాలు , భావోద్రేకాలు ఈ మహిళల ఆత్మహత్యలకి ప్రధాన కారణాలు కాగా వీరిలో 67.9 శాతం వివాహితులు . ప్రతీ ఆరు ఆత్మహత్యలలోనూ ఒకటి గృహిణిది గా గుర్తించబడింది .
మనిషి పుట్టుకకి మోహావేశం కేవలం ఓ భౌతికమైన కారణం కావచ్చు కానీ అంతర్గతమైన అంతిమకారణం మరోటుంటుంది . దానిని వెదుక్కుంటూ జీవన సాఫల్యాన్ని సాధించడానికి మనిషి బ్రతికి తీరాలి . 
శంకరాచార్య , క్రీస్తు , కీట్స్ , శ్రీనివాస రామానుజన్ , ఈ తరంలో కల్పనా చావ్లా ...వీరిలో ఎవ్వరూ తమ నలభైవ పడిని చూడలేదు కానీ కొన్ని వందల సంవత్సరాలకి సరిపడా సాధించి జీవన సాఫల్యాన్ని పొందారు . కారణం చాలా చిన్నది వీరెవ్వరి ప్రేమా కేవలం వ్యక్తి పట్ల కాదు . ఓ ధర్మం పట్ల , వ్యక్తుల పట్ల , ఓ భావం పట్ల , సిద్ధాంతం పట్ల , శాస్త్రం పట్ల , మొత్తం మానవాళి పట్ల .
బ్రతకడం ఒక కర్తవ్యం. దానిని విధిలేక కొనసాగించకూడదు , అనుక్షణం ఆస్వాదిస్తూ  ఆనందంగా నిర్వహించాలి . అసలీ ఆత్మహత్యల వెనుక మౌలికమైన కారణం ప్రేమ కాదు , వారి జీవితం పట్ల వారికి ప్రేమ లేకపోవడం . చదువు , ఉద్యోగం , ప్రేమ , పెళ్ళి ,వైఫల్యాలు , అప్పులు , అవమానాలు ....కారణాలేమైనా మనిషికి  తన జీవితం కంటే ఎక్కువ కాదన్న ఒక్క నమ్మకాన్ని , కోల్పోయిన వేటినయినా తిరిగి పొందవచ్చు ఒక్క జీవితాన్ని తప్ప అనే అవగాహనని చాలా చిన్న వయసునుంచే ఈ తరంలో కల్గించవలసిన నైతికమైన బాధ్యత అందరిపైనా వుంది . కాకుంటే గంటకి పదిహేను గా నమోదయిన ఆత్మహత్యల రేటు సెకనుకి ఒకటిగా మారడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు . వృద్దించమే , వృద్దంచమే అని భగవంతుని వేడుకున్న చమకకారుడు కూడా మృత్యుంచమే (మరణాన్నివ్వు)  అని వేడుకోలేదు. ఎందుకంటే ఈ మద్యనే సీతారామశాస్త్రి గారు చెప్పినట్లు బ్రతకడం  ఓ కర్తవ్యం . 
బ్రతుకంటే అమ్మ ఒడి  బ్రతుకంటే కాదు అలజడి 
బ్రతుకంటే నాన్న ఎద సడి బ్రతుకంటే కాదు మృతి ఒడి 
ఆకులు రాలిన శిశిరం కొసలో తరువు తనువు చాలిస్తుందా 
ఆశల చిగురులు పోగుచేసుకుని ఆమనిగా విరబూస్తుందా 
ఆ మానుకున్న ఆశాదృక్పధం మనిషికి లేకుందా 
సృష్టినింక ఏ ప్రాణికైన ఆహ్వానమరణముందా  ....
ఎప్పుడో వ్రాసుకున్న పాటలోని ఆఖరి చరణం ఈ కాలం కి ముక్తాయింపు .
' కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ సమాః ..." కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నిండు నూరేళ్ళూ బ్రతకమన్న ఉపనిషత్ వాక్యం ముగింపు .   


http://vihanga.com/?p=9548





--













Wednesday, June 5, 2013

మొక్కే దేవతలు

 ఈ ఏప్రిల్ పదమూడవ తేదీన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మొదటి పుటలో ప్రచురించబడిన ఓ వార్త నన్ను ఓ ఉల్లాస ఉన్మత్తతకి గురిచేసింది. ఆనందం మారు రూపులో పరామర్శించింది.  రాజస్తాన్ లోని ఓ గ్రామంలో పుట్టిన ప్రతీ బాలిక పేరా నూటపదకొండు మొక్కలు నాటుతారనీ , అలా నాటిన మొక్కలు యిప్పటికి సుమారు అర్థమిలియన్ దాకా ఉన్నాయనీ.. అలాగే ఆడపిల్ల పుట్టిన వెంటనే తండ్రి దగ్గర పదివేలరూపాయలు తీసుకుని బంధువర్గం,గ్రామపంచాయితీ కలిపి మొత్తం యిరవైఅయిదువేల రూపాయలు ఆ బాలిక పేర యిరవై సంవత్సరాలకి డిపోజిట్ చేస్తారనీ అలా చేసేముందు ఆ బాలికకి చట్టపరమైన వివాహయోగ్యతా వయసు వచ్చేవరకూ ఎటువంటి పరిస్థితులలోనూ వివాహం చేయనని  ఆ బాలిక తండ్రి నుండి ఒప్పందపత్రం తీసుకుంటారనీ ఆ వార్త సారం . అద్భుతమైన ఆలోచన , అసాధారణమైన ఆచరణ .
    సుమారు దశాబ్ధం క్రితం వ్రాసిన ఓ పాటలోని చరణం – `ప్రతివోడూ ప్రతియేడూ ఒక్క మొక్క నాటి వుంటే , పుట్టే ప్రతిబిడ్డకొక్క మొక్క లెక్క నాటివుంటే ,నేలతల్లి గుండెకింత కోతమిగిలి వుండేదా , సముద్రాల గర్భంలో యేడి రగిలివుండేదా ..’ అని శృతించుకుంటూ ఆ పాట ప్రభావంలో కొన్ని సంవత్సరాల తరువాత కూడా తమ కుమార్తెల మొదటి పుట్టినరోజు వేడుకలలో తిరుగు బహుమతులుగా మొక్కలని కాగితం సంచులలో పెట్టి వచ్చినవారందరికీ అందించిన యిద్దరు  ఆత్మీయ సహచరులని స్మరించుకుంటూ … ఆ ఆంగ్ల  దినపత్రిక లోని వార్తని ఓ మిత్రుడి  ముందుంచాను . కడివెడు నీళ్ళకోసం క్రోసుల దూరాన్ని నడవాల్సొచ్చే రాజస్థాన్ లో ఈ ప్రయోగం ఆహ్వానించదగిన సానుకూల దృక్పథమున్న పరిణామమే కానీ యిరవయి సంవత్సరాల తర్వాతైనా ఆ బాలికలు ఆ సొమ్ముని వారికి నచ్చినట్లు వినియోగపరచుకోగలిగే స్వేచ్చ ఈ దేశంలో వస్తుందంటారా … ? అని ప్రశ్నించాడు ఆర్థికశాస్త్రంలో ఉన్నతపట్టా పొంది సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఆ మిత్రుడు .  ఎగిసిపడిన ఆనందపుటార్ణవ కెరటం  ఒక్కక్షణంలో పడి విరిగింది . మానవుడు ఆశాజీవి అన్న ప్లాటో ని గుర్తుచేసాను . కానీ  అణుబాంబుని కనిపెట్టిన హట్టోహాన్ లా కనిపించిన ఆ మిత్రుడు బాంబ్ పేల్చాడు … రామారావు కి వాళ్ళావిడ  విడాకుల కాగితాలు పంపిందని . మానవ సంబంధాలు హృదయమాధుర్యాలని నమ్మే భావుకతా మూలాలని వదలలేని నేను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెబుతున్న ఆ మిత్రుడి వాస్తవిక ధోరణిని త్రోసిరాజనలేని వాస్తవం , మూడుముళ్ళేసి మూడు సంవత్సరాలు నిండీనిండక విడాకులవరకూ వెళుతున్న రామారావు వైవాహిక వైఫల్య స్థితి .

 ఏడాదిన్నర  క్రితం అనుకుంటా పాప పుట్టిందని రామారావు సహొద్యోగులందరికీ విందు  చేసాడు , కొన్ని నెలల తరువాత వాళ్ళవిడకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చాలా ముక్తసరిగా మొక్కుబడిగా స్వీట్లు పంచాడు . పందొమ్మిదేళ్ళ వయసుకే అతనికో పిల్లని కనిచ్చినందుకు సంతోషించిన రామారావు , అంతచిన్న వయసులో అతనికంటే ముందుగా అతను సాధించలేకపోయిన ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన భార్యని మనస్పూర్తిగా అభినందించలేకపోయాడని అతను తెచ్చి పెట్టుకున్న నవ్వే చెప్పింది . అతనిచ్చిన మిఠాయి చేదుగా అనిపించింది మాటని మనసులో దాచుకోగల నేర్పు నాకు లేదు . ` నా భార్య వయసు నా వయసులో ముప్పాతికకి కొద్దిగా ఎక్కువ , నా జీతం ఆవిడ జీతంలో ముప్పాతిక కంటే తక్కువ , అర్థసత్వాలు అన్యోన్యతకి అవరోధాలు కాకూడదనీ ,భార్య ఉన్నతిని ఆత్మనూన్యతగా భావించవద్దనీ  హాయిగా వుండమనీ  చెప్పాను . కొన్నాళ్ళు బాగానే వున్నారు . ఆ అమ్మాయి తండ్రి విత్తనం నాది కాబట్టి ఆ ఫలాలపై పెత్తనం నాది అన్నట్లుగా ప్రవర్తించాడు .  నా వాకిట్లో చెట్టుపై సర్వాధికారాలు నావికావాలన్నాడు భర్త . ఆ అమ్మాయి రోజూ తండ్రితో కలిసి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేది , రాత్రయేసరికి భర్త యింటికి చేరుకునేది . ఎ టి ఎం కార్డ్ మాత్రం తండ్రి పర్సులో భద్రంగా వుంది . రెండేళ్ళు తిరగకుండా పెళ్ళి పెటాకులదాకా వచ్చింది , పసిపిల్ల భవిత ఓ పవల్లిక . ఆ అమ్మాయి జీతం ఏ మేరకు ఎవరి కొరకు ఖర్చు చేయాలన్న విషయం లో ఆమె ప్రమేయం ఏమీలేదు . ఎప్పుడో ఓ సారి వీరలక్ష్మి గారన్నట్లు నిజంగా ` స్త్రీకి సంపాదించడానికి చాలా స్వేచ్చ వుంది నచ్చినట్లు ఖర్చుచేయడానికి లేదు .

 మరో పదిరోజుల తర్వాత వున్నట్లుండి మా సాంఘిక శాస్త్ర బోధకుడు వున్నపళంగా రెండురోజులు సెలవు కావాలన్నాడు , వాళ్ళావిడ రికార్డ్లు వ్రాసిపెట్టడానికి ఒక రోజు , ఆ రికార్డులకి అవసరమైన ఏభయి రకాల ఆకులు , కొమ్మలు సేకరించడానికి ఒక రోజు . ముచ్చటేసింది . ఆర్థికంగా కొత్తగా కలిగే వెసులుబాటు ఏమీ లేకపోయినా సరే భార్య ఆమెకి యిష్టమైన రంగంలో ఉన్నతిని సాధించడానికి తన సంపూర్ణ సహకారన్నందించే అతడి సంస్కారం ఆ ముచ్చటకి మూలం . ` సాయంత్రం మా యింటికి రండి , మీరు కాఫీ తాగేలోగా ద్రాక్షతో సహా మీకు కావల్సిన అన్ని రకాల ఆకులూ కొమ్మలూ నేనిస్తా’నన్నాను . సాయంత్రం నేనింటికి చేరేసరికి అతడు రాలేదు , అతని నుండి ఫోన్ వచ్చింది ` మీ కంటే ముందే మీ యింటికి వచ్చి కావల్సినవన్నీ కోసుకొచ్చేసాను , మీకు మొక్కలంటే అంతగా ఎందుకిష్టమో అర్ధం కాలేదు సార్ ‘ అని .

 ఓ చిన్న నవ్వే అప్పటి నా సమాధానం ఆ నవ్వుకి అర్ధం :

తమ ఉనికితో అందాన్నీ ఊహతో ఆనందాన్నీ యిస్తూ తాముండే  నేల మీద తాము ఆధారపడినట్లు కనిపిస్తూ నిజానికి ఆ మట్టి గట్టి తనమంతా మట్టిపాలు కాకుండా కాపాడుతాయి దీనినే సోయిల్ ఎరోజన్ అంటారనుకుంటా మీ జాగ్రఫీలో . పవిత్ర సవితృ కిరణతోరణం పత్రహరిత నేత్రాల ధారణం  నేలతల్లి గుండెలలో జీవం నింగి కొసల గాలులతో లీనం కాగా కదిలిన ఆమ్ల జని మానవ జీవన రసధుని అన్నాడయ్యా కవి . అంటే గాలి లో ని కార్బన్ డై ఆక్సైడ్ ని తాముండే నేలలోని నీటితో కలిపి సూర్యరశ్మి సమక్షంలో ప్రాణవాయువు గా చేసి మనకందిస్తాయని . మనకంటే ఎంతో ఉన్నతంగా వున్నా ఆకులతో ఆప్తాలింగనం చేసుకుంటాయి , శిరసు వంచి నమస్కరిస్తాయి , పువ్వులతో పలకరిస్తాయి , తిండిపెడతాయి …

 …అచ్చం స్త్రీమూర్తులలాగానే

తమచుట్టూ ఎన్ని విషవలయాలున్నా విశ్వవ్యాప్తమవుతున్న జ్ఞానాన్నంతటినీ  స్వంతం చేసుకుంటూ తమలో అంతర్లీనమైన వివేకంతో అమృతమయమైన ప్రేమనందిచినట్ట్లు , పుట్టింటిపైనో మెట్టినింటిపైనో ఆధారపడినట్లు కనిపిస్తూ నిజానికి వారికే ఆధారమౌతున్న స్త్రీమూర్తులు మొక్కలలాగే స్వయం సిద్ధలు . కానీ వారి సంస్కారం కారణంగా మనకి మొక్కే దేవతలు నిజానికి మనం మొక్కవలసిన దేవతలు ..అని

అందుకే మొక్కలని విరివిగా పెంచుదాం మహిళలని స్వేచ్చగా ఎదగనిద్దాం!

 శోభాయమానమైన లోకం  కోసం శుభకరమైన జీవితం కోసం  …..

http://vihanga.com/?p=8969

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Wednesday, May 8, 2013

నిర్వాణాష్టకమ్




నేను మనసుని కాను, మేధనీ కాను,అహాన్నీ,మనోజ్ఞానాన్నీ కాను; 
నేను దేహాన్నీ, దేహ పరివర్తనలనీ కాను; 
నేను దృశ్య శ్రవణ జిహ్వ ఘ్రాణేంద్రియాలనూ కాను, 
పృధ్వి,వాయు,ఆకాశ,తేజాలను నేను కానే కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను (శివోహం,శివోహం). 

నేను ప్రాణాన్ని కాను,పంచ ప్రాణ వాయువులనీ కాను; 
పంచేంద్రియ పేటికా పదార్దాలనీ కాను,పంచ కోశాలనీ కాను నేను; 
నేను కర్మేంద్రియాలనీ కాను, ఇంద్రియ జ్ఞానాన్నీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని,నేనే అతను (శివోహం,శివోహం). 

నేను అసహ్యాన్నీ అనుబంధాన్నీ ఎరుగను,ఆశనీ,మాయనీ కాను; 
అహంకారిని కాను,వైషమ్యాన్నెరుగను,ధర్మాన్ని కాను,మోక్షాన్నీ కాను; 
నేను కాంక్షని కాను,కాంక్షగొలిపే విషయాన్నీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

నేను పాపాన్నీ పుణ్యాన్నీ కాను,ఆనందాన్నీ అశ్రువునీ కాను; 
ఆలయాన్నీ కాను,అర్చననీ కాను,పుణ్యక్షేత్రాన్నీ,పవిత్రలిఖితాన్నీ కాను, 
ఆనందపు చర్యనీ,ఆనందింపదగిన వాడినీ,ఆనందించే వాడినీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

మృతి లేదు నాకు మరణ భీతి లేదు, కుల మతాలు లేవు, జాతి లేనేలేదు; 
నేనసలు ఏనాడు జన్మించనే లేదు,తల్లిదండ్రులు లేరు,బంధు మిత్రులులేరు; 
గురువు, శిష్యుడు నాకు లేనె లేరు; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

జ్ఞానాలచే నేను స్పర్శించబడలేదు,నేను ముక్తినీ జ్ఞానినీ కాను; 
ఆకృతీ,అవధీ,లేక కాలాంతరాళాల ఆవలి గట్టున నేను; 
సమస్తంలోనూ,సర్వంలోనూ విశ్వమూలాలలోనూ నేనే. 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణానందాన్ని- 
నేను అతడిని,నేనే అతను (శివోహం,శివోహం). 

The complete works of swami vivekanada vol-4 pp 391,392 నుండి స్వేచ్ఛానువాదం