Saturday, May 7, 2011

ప్రాణధారనే పంచింది పాలబువ్వ తినిపించింది ...



పల్లవి :
అమ్మ కడుపులో హాయిగా ఆరంభమైన గమనం
మట్టిగుండెలో ఛాయగా నిదురించు వరకు పయనం
నేనడగకనే దొరికిన వరమే అమ్మా ! ఈ జన్మ
జన్మజన్మకీ నిన్నే అమ్మగ వరమిస్తే చాలు బ్రహ్మ
చరణం :
ఆ సూర్యుడైనా ఏ పొద్దయినా నిద్దుర లేచాడా ?
సుప్రభాతమై అమ్మ పాటేదొ తట్టి లేపకుండా !
చందమామ ఒక క్షణమైనా చల్లగా కునుకు తీసిందా ?
మబ్బుల ఒడిలో జోకొట్టే అమ్మ జోల వినకుండా !
చరణం :
కడుపు మాడ్చుకుని కన్న బిడ్డలకి కడుపు నింపు తల్లి
తన కంటిపాపలో చంటిపాపలా సాకు కల్పవల్లి
కలల తేరుని విరుల తీరాల చేర్చే అల అమ్మ
గుండె అలజడిని అమృతధారగ మార్చే వరమమ్మ
చరణం :
ప్రాణధారనే పంచింది పాలబువ్వ తినిపించింది
మనిషిగా జీవించమని మరీ మరీ దీవించింది
నుదుట ముద్దాడి లాలించే అమ్మే తోడుంటే
నుదిటిరాతనే మార్చి వ్రాయగల సత్తా మనవెంటే ...
ఆ అమ్మ జన్మ సార్థకమవదా మనుషులుగా మనముంటే ...

( మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకి ప్రేమ తో ..)

No comments:

Post a Comment