Saturday, January 19, 2013

ద్వైతాద్వైతం


  వృద్దాప్యపు శిశిరంలో వసంతపు సందడి.18 వసంతాలు నిండిన పెద్ద మనవ రాలి పెళ్ళి హడావుడి.ఇల్లంతా తోరణాలు, మంగళ వాయిద్యాలు పందిట్లో అగరు పొగలు,అత్తరు వాసనలు,పట్టు చీరల రెపరెపలు.అంత హడావుడిలోనూ క్రీగంట చూపులూ,సైగలూ,కొంటె నవ్వులూ మరిచిపోని కుర్రవాళ్ళూ,పోస్ట్ మేనూ,ఫామిలీ డాక్టర్ తో సహా పిలిచిన అందరూ వచ్చినట్లే వున్నారు పెళ్ళికి. 

         పెళ్ళి పీట పక్కనే రెండు కుర్చీలు వేయించాడు పెద్దాడు. కూతురి పెళ్ళి తంతంతా పక్కనే కూర్చుని జరిపించమని. ఏమయినా నా పెద్ద మనవరాలు అంతా వాళ్ళ నాయనమ్మ పోలికే. పీటల మీద కూర్చుంటే పాపట చెందిరము కనుపాపల కజ్జల రేఖ... గళాన గంధపు పూత ...ఉహు... నా దిష్టే తగిలేలా వుంది పిల్లకి. సుమూహూర్తం దగ్గర పడుతున్నా నా పక్క కుర్చీ మాత్రం ఖాళీగానే వుంది. గాడి పొయ్యి దగ్గర అజమాయిషీయో పట్టు చీర సింగారమో... 


         ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం పెళ్ళికి అమ్మగారో అత్తవారో కొనడం తప్ప నేనెప్పుడూ ఓ పట్టు చీరైనా కొనిబెట్టెరుగను. యిదిగో యిప్పుదైనా పిల్లలు మరీ పట్టు బడితే తీసుకుంది. 


         శ్రీమతి పందిట్లోకి ఇంకా రాలేదు. యింత ఆనందంలోనూ ఏవో భావాలకందని అలజడి. డాక్టర్ సూర్యం ఎందుకో లోపలికి హడావుడిగా వెళుతున్నాడు. 


         మహా వాగ్గేయకారుని స్వరంలో అపశృతిలా రెండో అమ్మాయి వచ్చి "నాన్నా ఒక్క సారి లోపలికి రా అమ్మకి...మళ్ళీ... " అంటూ నెమ్మదిగా చెప్పింది. గుండెను చీల్చిందా కబురు. మనసు ఆతృతతో అలజడితో పరుగులు తీస్తోంది,మనిషిని మాత్రం నడిచి వెళ్ళాను. జీవన ధాత్రిని ఒడిలోకి తీసుకున్నాను. 


         నలభై ఏళ్ళుగా నా బతుకులో బతుకైన బంగారు తల్లి...నాకు యిక వుండబోదని చెప్పి ధైర్యంగా వుండమన్నాడు డాక్టరు. ఒక్క క్షణంలోనే ప్రపంచంలోని ఏకాకితనమంతా నా దరిచేరింది. ఇంత స్థబ్దంగా ఏ వేళా నా మనసు రోదించలేదు. కానీ కానీ ఆమె నా నుండి దూరమవుతుందంటే , ఇక ఏ నాడూ అందుకోలేని తీరాలకు చేరబోతోందంటే ఏదీ ఇంకా ఈ గుండె బద్దలవదేం ? ఈ చిన్ని గుండె నిండా నిండినది ఆమే అనేమో నా గుండె కింత ప్రాణ భీతి. 
 ఎలా చెప్పను కనులు మూసి కలలు కనే వయసులో నా కనులు తెరిచి తానే కలయై వచ్చి ప్రేమంటే ఏమిటో చెప్పి... ఆప్యాయతతో అమ్మగా, అనురాగంతో చెల్లిగా, అభిమానంతో స్నేహితగా, ప్రేయసిగా భార్యగా సహనంతో సౌహార్ద్రంతో జీవనవాహినిలో అంతర్వాహినిగా సాగి బతుకు బాటను నందనం చేసింది. 

        
తలపులో వలపులో ప్రతిక్షణం అమృతమయం తన జ్ఞాపకాల మధువు.లోచనాల్లో ఆలోచనల్లో ఎదలోతుల్లో అంతటా నిండినది ఆమే. 

        
నేను నీవు ఇన్ని లేవు కన్నా వున్నదొకటే నేనే నీవు. అధ్వైతమే ప్రేమంటే అంటూ చిరునవ్వి, బ్రతుకు తియ్యందనాలు నాకందించి ఇంతలోనే దూరమవుతుందంటే ... ఈ చిన్ని గుండె తట్టుకోలేదని ఎలా చెప్పను? ఎవరామె అంటే ఏం చెప్పను ? ఆ అంతర్వాహిని నా జీవన జీవని. 


**                **                **


అంతర్వాహిని 

        
తొలి వేకువ తెలి వెలుగు రేకల చిరు వేడిమికే ఓ హేమంత ప్రభాతాన కరిగే హిమ సుమాలైన కలల కలవరింతలు జ్ఞాపకాలై ... చేమంతుల తోటలలో వెర్రిగా విరాగినై ఒక్కణ్ణీ అయి తిరుగాడుతుంటే...' ఎవరావిడ ' ? కళ్ళకి కరుణ కాటుక, నుదుట వాత్సల్యం బొట్టు, ఏ తపస్చేతనకో హిమవన్నగమే కరిగి, జారి, జాలువారి, మందాకినియై కదిలి కదిలి భగీరధుని పాదాలనంటి క్ర్మేణీ పెరిగి గుండె తాకి కబుర్లాడి శిరసు ముద్దడిన ఆమెని -'ఎవరమ్మా నీవు ' 'ఎందుకింత దయ ? ' అని దీనంగా మౌనంగా అర్దిస్తే ...' నేనేరా కన్నా ! అమ్మని ' అని ఆమె చిరు నవ్వు బదులిస్తే- యుగాల వేదనా భారమంతా ఒ..క్క...క్ష...ణం లో ఆమె కంటి పాప ఒడిలో నే చంటి పాపనైన క్షణంలోనే తీరిపోయిన అనుభూతి.ఎంత తీయని స్వప్నం ! ప్రభాత నయన విభ్రమం !! 
 హేమంత శిశిరాల నడుమ కరిగిన హిమ పుష్పాన్నై అలసట ఆర్తిగా కళ్ళలో ప్రతిఫలించేందుకూ అలసి నిస్సత్తువ నరాలనీ , నిర్లిప్తత మనసునీ ఆవరించినపుడు- అల్లరిని ఆప్యాయత తో మేళవించి కబుర్ల కళారాల రేకులతో కరిగిన కలల చారికలనీ తుడిచి ... ఎవరమ్మా నీవంటే, చెవి మెలిపెట్టి 'నేనేరా స్వరాల తల్లిని, వరాల చెల్లినీ అన్న సుమ స్వప్నాల రంగవల్లి, శుభ మానసరాగాల కల్పవల్లి. 

         అపరాహ్నం , సంధ్య కెంజాయ నీడలలో కరిగిపోయాక అలసట కాసింత ఆనందంలో అలసి పోయాక, నదులు సముద్రంలో కలిసే చోట , నీరెండ రేయెండలో ఏకమయ్యేవేళ...భానుడు అనుభవుడై యామిని ఒడిలో ఒదిగిపోయాక... స్వప్నాలు మంచు పుష్పాలై విరిసేందుకు మొగ్గ తొదిగే సంధ్య చీకటి ఏటవాలు క్షణాల మీద వెలుతురై జారిపోయాక...నీలి గగనం నుదుటి మీద జాబిలి ముద్దై అవని అధర సీమలపై వెన్నెల చిరునవ్వై విరిసినా...నా...లో..ఎందుకో ఈ పగలు పగిలి పోయిన వేదన ? 


         సరీగ్గా అప్పుడే గుండె గోదారి గట్టై, ఉహు గోదారే అయి ఎక్కడో పాపకొండల నడుమ నడక నేర్చుకుని, కోనసీమ కొబ్బరాకులతో కబుర్లాడి అంతలోనే అంతర్మధనాల అంతర్వాహినిలు గుండెలోనూ గోదారిలోనూ... 


         ఎన్ని వైరుధ్యాల అడ్డుగోడలూ,ఎన్ని సహేతుక నిర్హేతుక ప్రవహ్లికలూ అవాంతరాలైనా ... పచ్చిక బయళ్ళలోనూ, యిసుక మైదానాల్లోనూ, వెన్నెల వాగుల్లోనూ,చీకటి ఛాయలలోనూ...కలిసి,కదిలి,కరిగి, ఘనీభవించి మూర్తీభవించిన మానవాకృతియై, మహనీయుని మనోకల్పిత రస రాగ కృతేఅయి; పలకరించిన పడతీ ! ' ఎవరు నువ్వు ? ' సంధ్య కాంతివా, స్వప్న కాంతవా ? అని ప్రశ్నిస్తే ... అల్లరిగా, అలవోకగా, జాలిగా జాబిలిలా నవ్వి ఒక్క కరచాలనం తో ' నేనా నీ స్నేహితనే ' అన్న సన్నిహిత. జీవన సంధ్యా స్వప్న సారికా ప్రియ గీతిక. 


         అమ్మ ఒడిలోంచి అలనల్లన జారి చెల్లెలి అల్లరి అనురాగంతో పెనవేసుకుని పెరిగిన బాల్య కౌమార్యాలూ, తొలి యవ్వనపు రోజుల ప్రియ స్నేహిత కరచాలనంతో రంగరించిన ఆత్మీయతా... మది పాత్రని జ్ఞాపకాల మధువుతో నింపుకున్న ఓ మధు మాసపు ఏకాంత రాత్రి ...డాబా మీద చంద మామ పెద్ద ముత్తయిదువై పరిచిన వెన్నెల తివాసీ పై- జ్యొత్స్నాభిసారికయైన కళ్యాణ వీణ. క్రీగంట చూసినా, కొనగోట తాకినా మౌనమో, గానమో మధురిమై పలికిన అనురాగ జాణ. 
 పాపట చెందిరము కనుపాపల కలల అర్ణవం, గులాబిరేకుల చీర కట్టు,పొగ మంచు తన మనో సౌకుమార్యం ముందు తీసి కట్టే అయినట్టు... ఆ అన్నట్టు...కరుణ ఆమె కళ్ళ కాటుక, దయ ఆమె ఆర్ద్ర హృదయ గీతిక. సౌహార్ద్రం సరే సౌమ్య సంభాషణమూ ఆమె స్వరభూషణమే అయి, నా జీవితపు వసివాడిన ఆశల విరిరేకులకీ తన కన్నీళ్ళ తో జీవం పోసి... నా గుండె పాత్రలో ఆనందం మరీ ఎక్కువై కళ్ళ వెంట ఒ..క్క...నీటి చినుకై పొరిలినా విహ్వలయై విలవిలలాడిన బేల హృదయ... బ్రతుకు చరమ గీతంలో చివరి చరణం లో కలిసి--పల్లవీ తానే అంతర్లీన సంగీతమూ తానే అయి... యింత చేసి చివరికి... ఎవరు ...ఎవరు...నువ్వన్న నా అజ్ఞానపు ప్రశ్నకి సైతం... బదులుగా..' నేనా...నేనేనా...నువ్వే, త్వమేవాహం , నీలోనేగా నా అస్తిత్వం " అని బదులిచ్చి వేకువ వేడిమికే కరిగిన కలల కౌముదికి కంటి వెంట జారిన ఆఖరి కన్నీటి చుక్క వీడ్కోలు పలికినట్ట్లు,శిశిరం కొసలో రాలే శిధిల పత్రాన్ని ఆమని వస్తూ వస్తూ ఓ సారి ఆర్తిగా పరామృశించినట్ట్లూ అల్లరి గాలి అల వేణువు గుండెలో జారి నాదమై...అంతలోనే వేణువునొదిలి తిరిగి గాలిలోనే కరిగి విశ్వవ్యాప్తమయినట్ట్లు... 

        
కనుమూసి తరచులోనే జీవన స్వప్న ప్రాంగణంలో కలిసి అంతలోనే....కరిగి పోయి...కనుమరుగయిపోయి... 


**                **                **


        
నాన్నా...నాన్నా...అని పిలుస్తోందా అమ్మాయి. 

        
అక్కడున్న డాక్టరుకి అప్పటికి అర్దమయింది తన స్నేహితుడు స్వర్గద్వారం వైపు నెచ్చెలితో చెట్టాపట్టాలేసుకుని నడక సాగిస్తున్నారని...జీవితమంతా నడిచినా తనివితీరని అసలు ఆగని నడక. మరెన్ని జన్మల తీరాలకో సాగిపోయే నడక. 

        
ప్రేమైక జీవుల అద్వైత యాత్ర... 

         (...
ఆ పెళ్ళి జరిగిందా వాయిదా పడిందా...ఆగిపోయిందా...లాంటి సామాజిక అసందర్భ ప్రశ్నలకి ఈ రచయిత వద్ద సమాధానం లేదు.)

No comments:

Post a Comment