కవి :
అక్షరం నీవు, అక్షయం నీవు
అమృతం నీవు , అద్భుతం నీవు
ఆర్తిలో నీవు , ఆత్మలో నీవు
ఇల స్వరం నీవు , ఈశ్వరం నీవు
ఉప్పెనవు నీవు , ఊపిరివి నీవు
ప్రాణమై నీవు , ప్రణవమై నీవు
కావ్యమై నీవు , శ్రావ్యమై నీవు
నవ్యమై నీవు , భవ్యమై నీవు
దివ్యమై నీవు , దీపమై నీవు
కాంతివై నీవు ,క్రాంతివై నీవు
భ్రాంతివై నీవు , శాంతివై నీవు
ఏలనో నీవు ఎదుట పడిరావు
ఎదను నిలిచావు బ్రతుకు మలిచావు
ఎవరివో నీవు నాయకీ
నా కలల వల్లకీ పల్లకీ ...
నాయకి : 1
అడుగుజాడ నా అడుగుజాడ గురజాడదీ
అది భావికే బాట ...
మదిలో మూఢత్వాలని చెండాడే పాట !
శుల్కాల ... కన్యాశుల్కాల శృంఖలాలు
జాతిని చెరబట్టినపుడు
కన్నీటి ` కన్యక 'లకు ఓదార్పు నా మాట
సంస్కరణా సంస్కారం నా వాణి నా బాణీ
మధుర స్వర వాణినీ , మధురస స్వర వాణినీ
నే మధుర సరస వాణినీ ...
నాయిక : 2
ధర్మ రక్షణే దేశ రక్ష గా ఎంచిన నాధుని నాయికను
సత్యం ధర్మం సత్సంప్రదాయమిలపై నిలిపే గీతికను
వేద స్మృతులకు సజీవాకృతిని , `వేయిపడగల ' మణుల కాంతిని
అపర బ్రహ్మ ఈ ఆంధ్రభారతికి పట్టిన అక్షర హారతిని
ఆంధ్ర సాహితీ కల్పతరువు ఆ `విశ్వనాధ ' కృతినీ
శార్వాణి వీణ శృతినీ ...
నాయిక : 3
ఇలను లేనిదేదో కలలో కాంచిన వాడు
ఊహల పల్లకిలో ఊరేగే నా ఱేడు
కరుణా కన్నీరూ రంగరించి నన్ను మలిచి
చందనాలు చిలకరించి పూల పానుపు పరిచి
చలువరాతి మండపాన వెన్నెల వాగులలోన
నన్ను నిలిపి ` నీవె సఖీ ! భావ కవిత ' వన్న వాడు
`గురుదేవ కవి ' కి సరిజోడు
తెలుగు ఎదకు సుతిమెత్తని సుమదళాల ఆమని
` కృష్ణశాస్త్రి ' పదము సోకి పులకించెను ఈ వని
నాయిక : 4
మెడలో పూసల పేరు పెట్టి తలలో పూవులు సేరు చుట్టి
ముద్దబంతి పూవు లాంటి ముగ్ధమైన మనసుతోటి
ఏటి అలలా ఎగిసిపడుతు , యెన్నెలొయలు పరుచుకుంటు
మంచెపైన మంచుపూల రాశి లాంటి సొగసుతోటి
ఒక్కనవ్వె చాలదా ...నా ఒక్క నవ్వే చాలదా
తెలుగు పాటకే పరిమళంలా
తేట తెనుగున తేనె కలిపిన పల్లె పాటగా పల్లవించిన
`నండూరి ' ఎంకిని నే నాయుడోళ్ళ ఎంకినీ ...
నాయిక :5
నిప్పులు చిమ్ముతు నింగికెగిరినా
నాతోడెవరూ రాలేరు
నెత్తురు చిందుతు నేల రాలినా
నా దారెవరూ కనరారు
ఎరుపెక్కిన ఆవేశం నాది
ఆకుపచ్చ ఆలోచన నాది
తెలుగు `వాడి ' కీ తెలుగు వేడికీ ఖడ్గ సృష్ఠి నేను
చిచ్చర పిడుగు `శ్రీశ్రీ ' ఎదపై ఎర్ర శాలువానూ !
నా నడక మహాప్రస్థానం
నా మాట మరోప్రస్థానం
అభ్యుదయం నా అస్త్రం
అతినవ్యం నా అస్రం
ఆకలి రక్కసి కర్కస కౌగిట -
నలిగే ప్రేవుల రణన్నినాదం నాలో సంగీతం !
చీకటి చీల్చే వేకువ సూర్యుని -
వెచ్చని ఎర్రని వెలుతురు కిరణం - నా అడుగుల సంకేతం !!
కణకణ మండే నిప్పుల కొలిమి నాలో ఆవేశం
కళకళలాడే సమసమాజమే (నా) జీవన ఆదర్శం ....
1 నుండి 5 అందరూ :
మనసుని మధురం చేసే మధనం
సాగించాలి నీవు
మనుగడ సుగమం చేసే రీతులు
శోధించాలి నీవు
అగ్ని వర్షించినా , అమృతం కురిసినా
అందం ఆనందం అందరి ఆనందం
పరమావధిగా ఉపాసించు , నీ వశమవుతాము
మేము నీ స్వరమవుతాము మేము నీ వరమవుతాము
అక్షర మాలికలం జాతికి అమృత దీపికలం
అక్షర మాలికలం జాతికి అమృత దీపికలం
కవి : ధన్యోశ్మి !
(తెర వెనుక నుండి :
సర్వేజనా సుఖినోభవంతు...ఓం శాంతి శాంతి శాంతి:
తెలుగు భాషలోని తియ్యదనాన్ని యెంతో సులభంగా, చక్కగా, మా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మీ 'సాహితీ లీలా విలాసం,' నృత్య రూపకాన్ని శ్రీనివాసరావుగారు. చదువుతున్నంతసెపు చుట్టూ పరిసరాలను మరచిపోయి మరీ చదివాను. బ్యూటిఫుల్ సింప్లి బ్యూటిఫుల్.
ReplyDeletedhanyOSmi !
ReplyDelete