Wednesday, July 7, 2010

సౌందర్య లహరి (నృత్య రూపకం ) ...



ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం
కాలం కన్నులలో కలలకి అర్ధాలం
ప్రకృతి వన్నెలలో మెరిసే అందాలం
ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం

ఆకుపచ్చ అందాల ఆమని నేను
కోయిల పాటల పులకిత గాత్రను
మధుమాసమే మధుర దరహాసమై
వికశించు రాగాల పరిమళం నేను
హిమనగాలు తలవంచే సొగసుల అలివేణినీ
అందెల పాదాలకి సందెల పారాణినీ
మేఘాల దాహాలు తీర్చే అరుణాన్ని
నేను గ్రీష్మాన్నీ ...

మబ్బుల మనసుని మట్టికి తెలిపే
మధురస రాగాన్ని నే మధుర సరాగాన్ని
మట్టిగుండెలో మధుర కాంక్షలకు -
ప్రాణ పరాగాన్ని నే ప్రేమ పరాగాన్ని
నింగి కొంగులో రంగురంగుల హంగులద్దగలను
హరివిల్లునివ్వగలను
నెమలి అడుగుల తాళలయగతుల ప్రాణమవ్వగలను
నే వర్ష రాగ సుధను మీ హర్ష మేఘ సుమను

మరుని హరునికైనా మరో ప్రాణమైన
మందార బంధాల అందాల భామను
గోగుపూల పరిమళాల గోధూళి తెరలలో
చలి వన్నెల సిరి వెన్నెల కాంతిని నేను
శాంతిని నేను శరత్ కాంతను నేను

పైరు సిరుల పంచే ముద్దుల పూబంతిని
కలల కళలు పెంచే కమ్మనైన కైతని
పుడమిసిగన పుష్యరాగ సీమంతాన్ని
నేను హేమంతాన్ని ...

మోడువారిన మానునైనా
చెడుని చీల్చే శరము చేసే
ఆకురాలిన అనుభవాన్ని
ఆశలకు తొలి ఆసరాని
నేను శిశిరాన్ని నేను శిశిరాన్నీ ..

ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం
కాలం కన్నులలో కలలకి అర్ధాలం
ప్రకృతి వన్నెలలో మెరిసే అందాలం
ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం ...



2 comments:

  1. శ్రీనివాసరావుగారు,
    మీరు రచించిన నృత్యరూపకం, 'సౌందర్యలహరి,' చాలా బావుంది. ప్రకృతిలోని ఆరు ఋతువులను మనసుకి హత్తుకునే విధంగా వర్ణించారు. మీ రచనావ్యసాంగం ఇలాగే సాగిపోతూనే వుండాలి.

    ReplyDelete
  2. thanks and sure literature is not my bread but my breath

    ReplyDelete