Wednesday, July 7, 2010

సౌందర్య లహరి (నృత్య రూపకం ) ...



ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం
కాలం కన్నులలో కలలకి అర్ధాలం
ప్రకృతి వన్నెలలో మెరిసే అందాలం
ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం

ఆకుపచ్చ అందాల ఆమని నేను
కోయిల పాటల పులకిత గాత్రను
మధుమాసమే మధుర దరహాసమై
వికశించు రాగాల పరిమళం నేను
హిమనగాలు తలవంచే సొగసుల అలివేణినీ
అందెల పాదాలకి సందెల పారాణినీ
మేఘాల దాహాలు తీర్చే అరుణాన్ని
నేను గ్రీష్మాన్నీ ...

మబ్బుల మనసుని మట్టికి తెలిపే
మధురస రాగాన్ని నే మధుర సరాగాన్ని
మట్టిగుండెలో మధుర కాంక్షలకు -
ప్రాణ పరాగాన్ని నే ప్రేమ పరాగాన్ని
నింగి కొంగులో రంగురంగుల హంగులద్దగలను
హరివిల్లునివ్వగలను
నెమలి అడుగుల తాళలయగతుల ప్రాణమవ్వగలను
నే వర్ష రాగ సుధను మీ హర్ష మేఘ సుమను

మరుని హరునికైనా మరో ప్రాణమైన
మందార బంధాల అందాల భామను
గోగుపూల పరిమళాల గోధూళి తెరలలో
చలి వన్నెల సిరి వెన్నెల కాంతిని నేను
శాంతిని నేను శరత్ కాంతను నేను

పైరు సిరుల పంచే ముద్దుల పూబంతిని
కలల కళలు పెంచే కమ్మనైన కైతని
పుడమిసిగన పుష్యరాగ సీమంతాన్ని
నేను హేమంతాన్ని ...

మోడువారిన మానునైనా
చెడుని చీల్చే శరము చేసే
ఆకురాలిన అనుభవాన్ని
ఆశలకు తొలి ఆసరాని
నేను శిశిరాన్ని నేను శిశిరాన్నీ ..

ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం
కాలం కన్నులలో కలలకి అర్ధాలం
ప్రకృతి వన్నెలలో మెరిసే అందాలం
ఆరు ఋతువులం అవనికి ప్రాణాలం ...



Sunday, July 4, 2010

సాహితీ లీలా విలాసం (నృత్య రూపకం )


కవి :
అక్షరం నీవు, అక్షయం నీవు
అమృతం నీవు , అద్భుతం నీవు
ఆర్తిలో నీవు , ఆత్మలో నీవు
ఇల స్వరం నీవు , ఈశ్వరం నీవు
ఉప్పెనవు నీవు , ఊపిరివి నీవు
ప్రాణమై నీవు , ప్రణవమై నీవు
కావ్యమై నీవు , శ్రావ్యమై నీవు
నవ్యమై నీవు , భవ్యమై నీవు
దివ్యమై నీవు , దీపమై నీవు
కాంతివై నీవు ,క్రాంతివై నీవు
భ్రాంతివై నీవు , శాంతివై నీవు
ఏలనో నీవు ఎదుట పడిరావు
ఎదను నిలిచావు బ్రతుకు మలిచావు
ఎవరివో నీవు నాయకీ
నా కలల వల్లకీ పల్లకీ ...

నాయకి : 1
అడుగుజాడ నా అడుగుజాడ గురజాడదీ
అది భావికే బాట ...
మదిలో మూఢత్వాలని చెండాడే పాట !
శుల్కాల ... కన్యాశుల్కాల శృంఖలాలు
జాతిని చెరబట్టినపుడు
కన్నీటి ` కన్యక 'లకు ఓదార్పు నా మాట
సంస్కరణా సంస్కారం నా వాణి నా బాణీ
మధుర స్వర వాణినీ , మధురస స్వర వాణినీ
నే మధుర సరస వాణినీ ...

నాయిక : 2
ధర్మ రక్షణే దేశ రక్ష గా ఎంచిన నాధుని నాయికను
సత్యం ధర్మం సత్సంప్రదాయమిలపై నిలిపే గీతికను
వేద స్మృతులకు సజీవాకృతిని , `వేయిపడగల ' మణుల కాంతిని
అపర బ్రహ్మ ఈ ఆంధ్రభారతికి పట్టిన అక్షర హారతిని
ఆంధ్ర సాహితీ కల్పతరువు ఆ `విశ్వనాధ ' కృతినీ
శార్వాణి వీణ శృతినీ ...

నాయిక : 3
ఇలను లేనిదేదో కలలో కాంచిన వాడు
ఊహల పల్లకిలో ఊరేగే నా ఱేడు
కరుణా కన్నీరూ రంగరించి నన్ను మలిచి
చందనాలు చిలకరించి పూల పానుపు పరిచి
చలువరాతి మండపాన వెన్నెల వాగులలోన
నన్ను నిలిపి ` నీవె సఖీ ! భావ కవిత ' వన్న వాడు
`గురుదేవ కవి ' కి సరిజోడు
తెలుగు ఎదకు సుతిమెత్తని సుమదళాల ఆమని
` కృష్ణశాస్త్రి ' పదము సోకి పులకించెను ఈ వని

నాయిక : 4
మెడలో పూసల పేరు పెట్టి తలలో పూవులు సేరు చుట్టి
ముద్దబంతి పూవు లాంటి ముగ్ధమైన మనసుతోటి
ఏటి అలలా ఎగిసిపడుతు , యెన్నెలొయలు పరుచుకుంటు
మంచెపైన మంచుపూల రాశి లాంటి సొగసుతోటి
ఒక్కనవ్వె చాలదా ...నా ఒక్క నవ్వే చాలదా
తెలుగు పాటకే పరిమళంలా
తేట తెనుగున తేనె కలిపిన పల్లె పాటగా పల్లవించిన
`నండూరి ' ఎంకిని నే నాయుడోళ్ళ ఎంకినీ ...

నాయిక :5
నిప్పులు చిమ్ముతు నింగికెగిరినా
నాతోడెవరూ రాలేరు
నెత్తురు చిందుతు నేల రాలినా
నా దారెవరూ కనరారు
ఎరుపెక్కిన ఆవేశం నాది
ఆకుపచ్చ ఆలోచన నాది
తెలుగు `వాడి ' కీ తెలుగు వేడికీ ఖడ్గ సృష్ఠి నేను
చిచ్చర పిడుగు `శ్రీశ్రీ ' ఎదపై ఎర్ర శాలువానూ !
నా నడక మహాప్రస్థానం
నా మాట మరోప్రస్థానం
అభ్యుదయం నా అస్త్రం
అతినవ్యం నా అస్రం
ఆకలి రక్కసి కర్కస కౌగిట -
నలిగే ప్రేవుల రణన్నినాదం నాలో సంగీతం !
చీకటి చీల్చే వేకువ సూర్యుని -
వెచ్చని ఎర్రని వెలుతురు కిరణం - నా అడుగుల సంకేతం !!
కణకణ మండే నిప్పుల కొలిమి నాలో ఆవేశం
కళకళలాడే సమసమాజమే (నా) జీవన ఆదర్శం ....

1 నుండి 5 అందరూ :
మనసుని మధురం చేసే మధనం
సాగించాలి నీవు
మనుగడ సుగమం చేసే రీతులు
శోధించాలి నీవు
అగ్ని వర్షించినా , అమృతం కురిసినా
అందం ఆనందం అందరి ఆనందం
పరమావధిగా ఉపాసించు , నీ వశమవుతాము
మేము నీ స్వరమవుతాము మేము నీ వరమవుతాము
అక్షర మాలికలం జాతికి అమృత దీపికలం
అక్షర మాలికలం జాతికి అమృత దీపికలం

కవి : ధన్యోశ్మి !

(తెర వెనుక నుండి :
సర్వేజనా సుఖినోభవంతు...ఓం శాంతి శాంతి శాంతి:


Saturday, July 3, 2010

లలిత గీతం :


పల్లవి :

పరవశాల పల్లకిలో పద మల్లికలే పరిచి
ఎదురు నిలిచినాను సఖీ ! వరమీయవె ఒక సాకి
చరణం :
శ్రీనాధ కవినాధ కౌగిళ్ళలో ఒదిగి
శ్రీరంగ సూర్యుని కెంపు కన్నుల వెలిగి
శృంగార అంగార హృదయాల రగిలించి
మా భావ కవిదేవ స్వప్నాన నిదురించి
ఎంకి పాటల వొంకి వొడ్డాణములు చుట్టి
కిన్నెరసాని గా కదలి ఆడిన సఖీ ..

చరణం :

అధర ముద్రికలను అడగలేదే చెలీ
కౌగిళ్ళ లోగిళ్ళు కోరబోనే సఖీ
కలత నిద్దురనైనా నే కనుమూయులోపయినా
కాసింత కరుణించి వరమీయి ఒక సాకి
కొనగంటి చూపైన కరుణించవే చాలు
నీ చరణముల చెంత మరణమైనా మేలు ...!

స్వర కల్పన ,గానం : prof.bvbabu


నీవు రాని నిశీధాలు ...

పల్లవి

నీవు రాని నిశీధాలు
నా నిదురా నిషేధాలు
నీవు లేని శశి వెన్నెల
నీటి బిందు నా కన్నుల

చరణం :

ఎంత వేదన గుండె పిండగ
నీటి చినుకై కంటిలో
సుంత సాధన మేళవించగ
రాగ తునకై తీవెలో

చరణం :
విగత జీవిత గతము
స్మృతిగా ఎదను పిండే వేళలో
శృతులుగా నా కృతులుగా
వెతలు ఆకృతి దాల్చగా ...

స్వరకల్పన , గానం : prof.bvbabu

Thursday, July 1, 2010

ఏకాంతంలో ...

నిశి వేళల ఆ ఏకాంతములో
శశి వెన్నెలలో వేణువు నీవై
పలికిన గానం మరచితివా
మరపునె మధురిమలెంచితివా ...
నీ కనుపాపల ఒడిలొ పాపనై
నిదురించిన ఆ చల్లని రేయి
లాలి పాడితివి మరచితివా
జోలలూపితివి మరచితివా
మరపునె మధురిమలెంచితివా
తలపున నేను మరుపున నీవు
నిలిచిన జీవం చూసితివా
తెగిన తీవెలో రాగం వోలె
వాడిన కుసుమ పరాగం వోలె
వ్యదనే సుధగా యెంచితివా
మరపునె మధురిమలెంచితివా ...
సంగీతం ,గానం :prof.bvbabu


లెట్స్ కేర్ ...

మంచి గుర్తింపు కోసం
తపన పడదాం ,
గొప్ప గెలుపు కోసం
తపస్సు చేద్దాం .
గుర్తింపు పరిధినీ
గెలుపు ఆనందాన్నీ
విస్తృతం చేస్తాయి.
కానీ ...
గెలుపయినా ,
మలుపయినా
మన చిరునవ్వు
మనని విడిచి పోకుండా
జాగ్రత్త పడదాం ...