Sunday, July 24, 2011

మృత్యు మంజూష


భయమంటే నాకు చాలా భయం ! అందుకే ఎప్పుడూ దగ్గరకి రానివ్వ లేదు . నిప్పు , నీరు , నింగి , నేల , మనుషులు , జంతువులు , ఆకలి , అప్పులు , ఏవీ నన్ను భయ పెట్ట లేక పోయాయి . కాక పొతే ఒక్కో అనుభవం ఒక్కో పాఠాన్ని నేర్పాయంతే . ఎలా ఉండాలో కొన్ని , ఎలా వుండ కూడదో కొన్ని .
చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు , కోతి కొమ్మచ్చి లాటలలో చెట్లేక్కేటప్పుడు , వేసవి మధ్యాహ్నాలు మామిడి తోటలలో కాయలు కోసుకుని తోట మాలి అరుస్తుంటే పక్కనే వున్న ఏట్లోకి దూకేసి నప్పుడు , చినచిన్న దెబ్బలు తగిలినా ఎప్పుడూ భయపడలేదు. స్నానాలు చేసి తడి బట్లతో ఇల్లు చేరి నానమ్మ చేత మిత్రులంతా మూకుమ్మడిగా తిట్లు తిని వాటితో బాటు తాయిలాలూ తినేసి తిరిగి ఆటకి తయారు .
ఆట లక్ష్యం గెలుపో ఓటమో కాదు కేవలం ఆడడం అంతే. .
జీవిత పరమార్థం కూడా కేవలం జీవించడం , జీవితాన్ని యధాతధం గా ఆశ్వాదించడం అంతే కన్నీరు , చిరునవ్వూ , కస్టాలూ , సుఖాలూ , సౌఖ్యాలూ , గెలుపులూ ,ఓటమిలూ ...యివన్నీ ప్రతీ జీవితానికీ అంతర్లీన స్రవంతి గా ఎదురయ్యేవి . ఈ జీవన సత్యాన్నే మా తరానికి బాల్యం ఆటలయినా , బామ్మలయినా నేర్పినది . స్కూల్ లో చదువుకునే రోజులలో లెక్కలంటే బోలెడు భయ పడాలన్నారు , ఎక్కాలని వల్లే వేయించాడు తాతయ్య , ` జ్ఞాపకమే జ్ఞానం ' అన్న సోక్రటిస్ తెలియని తాతయ్య , వేదాలు , వ్యవసాయం మాత్రమే తెలిసిన తాతయ్య . అంతే లెక్కలంటే బొత్తిగా లెక్కలేకుండా పోయింది . ఇంగ్లీష్ అంటే భూతమనే భ్రమ కొన్నాళ్ళు , రోజూ ఓ పదం నేర్చుకుందాం అన్నాడో మిత్రుడు . తిరుగులేని తాయత్తు . దెబ్బకి దెయ్యం వదిలింది .
ఈ తరం పిల్లలకి ఆనాటి బాల్యపు ఆటలు లేవు , వీడియో గేములే . ఒడిలో కూర్చోపెట్టుకుని మంచి , చెడ్డా చెప్పే బామ్మలూ , తాతయ్యలు లేరు , వుంటే వృద్దాశ్రమం లోనో , కాకుంటే వేరే ఊర్లలొనొ , వేరే ఇళ్ళలోనో ...
For every problem there is a solution , if there is one find it , if there is none never mind it ! its not at all a problem then అని ధైర్యం చెప్ప గలిగే మిత్రులూ చాలా మందికి లేరు .. ఫలితం ఒక్క మార్క్ తగ్గి నాలుగు ర్యాంకులు వెనక పడితే అమ్మ తిడుతుంధనో , నాన్న కొడతాడనో , స్కూల్ లో తాట తీస్తారనో ...టెన్షన్ , భయం ... ట్యూషన్లు , హాస్టల్స్ ..
.ఆ మధ్య హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ఓ ప్రిన్సిపాల్ నిర్వాకం నుంచి , ఇటీవల ఎలమంచిలి లో ఓ ట్యుటోరియల్ సెంటర్ నిర్వాహకుడి అఘాయిత్యం వరకూ ( అవి ఏమిటో వివరించి నా కీ బోర్డ్ కి అశ్లీలపు రాతల అపవిత్రతని అంటగట్ట లేను నేను )
యింక కలల కొత్త లోకాలని ఆవిష్కరించే కళాశాలలు , విశ్వవిద్యాలయాలు , ఉద్యోగ ప్రదేశాల లో మాత్రం మేమేం తక్కువ తిన్నాం అంటూ ... ప్రేమ పేరిట ఎమోషనల్ బెదిరింపులూ , ఆత్మ హత్యలూ ,ఏసిడ్ దాడులూ ,...హత్యాయత్నాలూ, హత్యలూ ...

సంసారాల సాగరాల అలల కల్లోలాలలో ఒక్క మునక వేసామనుకోండి ....పూటు గా తాగొచ్చి ,
వరం డాలో నిద్ర పోతున్న కట్టుకున్నావిడని లేపి లోనికి రమ్మని ఆఖరి అనుభవాన్నీ అనుమానం తో జీవితపు ఆఖరి క్షణాలనీ అందించ గలిగిన , అడ్డొచ్చిన ఆవిడ తరపు బంధువులని సైతం అక్కడికి అక్కడే నరికి వేయగలిగిన ఉత్తమోత్తముడయిన భర్త , అన్నం లో కి కూర వండి పెట్ట లేదని తల్లిని కడ తేర్చిన పుత్ర రత్నం , తనకు భారంగా మారిందని.. కన్నతల్లిని కర్కసం గా బతికుండగానే సజీవదహనం చేసి శవాన్ని సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేసిన మాననీయ మహిళా మాణిక్యం , అయిదవ తరగతి చదువుతున్న చిన్న కూతురిని .....( జుగుప్స తో వేళ్ళు వణుకుతున్నాయి ఈ సంఘటన వ్రాయడానికి ) న కామం తో కళ్ళు మూసుకు పోయిన ఒక దౌర్భాగ్యపు తండ్రి ...
యిలాంటి వెధవల వలన ... నిత్యం జరుగుతున్న దిక్కుమాలిన సంఘటనలని చానల్స్ లో చూస్తున్నా, పేపర్లలో చదువుతున్నా ... భయానికి నేనంటే భయం తగ్గుతోంది .

యివన్నీ ఒక ఎత్తు , సిద్దాంత పరమైన ( ! ? ) హత్యలు , తీవ్రవాదమ్ , రాజకీయాలు వీటి జోలికొస్తే ... వివరించేందుకు , ఈ కాలమ్ , నా కాలం రెండూ సరిపోవు , తిలక్ మాటల్లో చెప్పాలంటే ` గాంధీ గారి దేశం లో గజానికో గాంధారి కొడుకు ' భయమేస్తోందా ?

పాతిక సంవత్సరాల క్రితం అనుకుంటా ఆంగ్ల పద సంపద పెంచుకునే యత్నంలో ఓ కొత్త పదాన్ని ఉపయోగింఛి ఒక్కొరూ ఒక్కో వాక్యం చెప్పాలి అదీ ఆట ఓ మిత్రుడు చెప్పాడు ` satya sai baba is the incarnation of swami vivekananda ' అని ఆ వాక్యపు నిజానిజాల గురించి ఎప్పుడూ ఆలోచిం చ లేదు , అనవసరం అని . కానీ వివేకానందుడి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాం , మంచి english నేర్చుకోవడం కోసం . హిందూ ధర్మ శాస్త్రాల లోని మానవీయ విలువలని ప్రపంచానికి చాటడం గా ఆ పుస్తకాల సారం అప్పటికి మాకు అర్థమయింది .
సరే మరి బాబా గారి సంగతేమిటి ?
సుమారు 160 కి పైగా దేశాల నుంచి అరవై లక్షలకు పైగా భక్తులని పోనీ అనుయాయులని సంపాదించి ,వారి నుంచి లక్షల కాకుంటే వేల కోట్ల రూపాయలని సమీకరించి విద్య , వైద్యం ( ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఎక్కడయినా అత్యంత ఖరీదయినవి ఈ రెండూను ) సుమారు 1500 గ్రామాలకి తాగు నీరు సాగు నీరు అందించ గలిగిన మహనీయుడు మరణ శయ్య పై చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నప్పుడు "సత్యసాయి దేవుడయితే వీల్ చైర్ లోఎందుకు కూర్చుంటాడు సార్?" అని ప్రశ్నించిన ఏంకర్లున్న చానల్స్ చూడడమ్ ఒక ఖర్మ అయితే , ఆ ప్రశ్న కి సమాధానం యివ్వగలిగే అవకాశము , తీరికా లేక పోవడం ఒక అదృష్టం .
ఆయన మరణానికి కొన్ని వారాల క్రితమే మృత్యు మంజూష ( శవ పేటిక ) ని సైతం సిద్దం చేయించ గలిగిన మహా దార్శనికత కలిగిన మేధావుల చేతులలో వితరణ శీలులయిన అరవై లక్షల పైగా భక్తుల శ్రమ ఫలితం నిజంగా యిటు పైన నిజమయిన సేవలో సంపూర్ణం గా త్రికరణ శుద్ధి గా వినియోగించబడుతుందా ? అని ఇప్పుడు నాకు కొత్తగా పట్టుకున్న భయం.అవును.....
భయానికి బొత్తిగా నేనంటే భయం పోయింది ఈ మధ్య ఎప్పుడూ నాతోనే వుం టోంది.











Monday, June 6, 2011

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట ...

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట ...
సత్యలోకం లో ఓ అందమైన సాయంత్రం కచ్చపి తీవెలలో స్వరసుమాలు విరుస్తున్నాయి. బ్రహ్మదేవుడు తన్మయుడై ఆ రాగ పరిమళాలను ఆస్వాదిస్తున్నాడు. యింతలో మహతిని మీటుకుంటూ నారదుడు ప్రవేశించాడు , వెన్నంటే తుంబురుడూను , వీరిని చూడగానే బ్రహ్మదేముడికి భూలోకం గుర్తొచ్చింది . శూన్యం నుండి ధ్వని ప్రసరించదనీ స్పురణకొచ్చింది . తన భార్య సరస్వతికి ఎంతో ప్రియమైన ఆ వీణారావాలు భూలోక వాసులని చేరవని కొద్దిగా దిగులు చెందాడు . పాపం చతుర్ముఖుడు కదా అంతర్ముఖుడు కాలేకపోయాడు . సరస్వతీ వాహనమైన హంస ఆ దిగులు గమనించింది , తీర్చాలనుకుంది . అటూ యిటూ చూసి పుటుక్కున కచ్చపి నుండి ఓ తీవెని లాగి ముక్కున కరుచుకుని ... వైకుంఠం వైపు ఎగిరింది అలాగే పాలకడలిలో ములిగింది . లక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ఆశ్రీర్వాదాన్ని పొందింది . రెక్కలు కట్టుకుని... కైలాసానికి ఎగిరింది పార్వతి ఆశీర్వదించింది, గంగ అభిషేకించింది, శివుడు సరే సరి... తిరిగి సత్యలోకానికి చేరింది . ఆ తీవె తునకని భక్తిగా బ్రహ్మదేవుడి పాదాల ముందుంచింది . బ్రహ్మకేదో సంకేతమందింది . నవ్వుతూ మానస పుత్రుడైన నారదుడి వైపు చూసాడు . నారదుడు మహతి లోని ఓ తీవెని తీసి ఆప్యాయంగా బ్రహ్మకిచ్చాడు, అలాగే తుంబురుడూను ... ఈ మూడు తీవెలను కలిపి తను సృష్టించే కొంతమంది స్వరపేటికలలో అమర్చాడు బ్రహ్మ ...

....యిది జరిగి సుమారు 164 సంవత్సరాలైంది . త్యాగరాయ స్వామి అవతరించాడు సుమారుగా అప్పుడే శ్యామాశాస్త్రీను ...కాల క్రమేణా ...1946 జూన్ నాలుగున నెల్లూరు జిల్లాలో కోనేరమ్మపేట గ్రామం లో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శ్రీమతి శకుంతల దంపతులకి శ్రీ బాల సుబ్రహ్మణ్యం జన్మించారు .

శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారికి ఇద్దరు సోదరులు అయిదుగురు సోదరిలు . మొత్తం ఎనిమిది మంది సంతానంలో ఈయన రెండవవారు . ఈయన తండ్రిగారు అప్పట్లో పేరెన్నికగన్న హరికథాపండితుడు . సంగీత సాహిత్య విశ్వరూపం హరికథ .వేదికపై పాత్రధారి ఒక్కడే పాత్రలనేకం , గాత్రధారీ ఒక్కడే ... వేదికపై `` శ్రీకృష్ణుడై పాంచజన్యం పూరించాలి , అర్జునుడై గాండీవం సంధించాలి , రథమై , గజమై , ఘీంకారమై , ఓంకారమై , నృత్యమై , గానమై .." సర్వం, సకలం తానే అయి కథ రక్తి కట్టించాలి . అలా తన తండ్రిగారు చెప్పే హరికథలలో బాల్యం నుంచీ లీనమై గాత్ర శుద్ది నే కాక పాత్ర ఔచిత్యాన్ని సరిగ్గా పట్టుకోగల హృదయ ఔన్నత్యాన్నీ పెంచుకున్నారు శ్రీ బాలు . సమాంతరంగా చదువు . తండ్రిగారి కోరిక మేరకు మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ ., లో చేరారు . 1964 లో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు లలిత సంగీత పోటీలు నిర్వహించారు . బాలు పాల్గొన్నారు . శ్రీ ఘంటసాల గారు , శ్రీ పెండ్యాల గారు , శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు , న్యాయ నిర్ణేతలు . మొదటి బహుమతి శ్రీ బాలుగారికే . రవంత లేతగా వున్న శ్రీ బాలు గారి గాత్రం కాస్త ముదిరితే సీమాలలో అవకాసం యిస్తానన్నారు శ్రీ ఎస్.పి.కోదండపాణి గారు ఆ పోటీలో బాలుగారి పాట విని, పాడే పద్దతి నచ్చి . ...పాట మరింత ప్రాణమయింది. సార్థకమయే సాధనలో మెరీనా గాలులు మరింత పరిమళాన్ని పెంచుకున్నాయి .

దాదాపు రెండేళ్ళు నిరీక్షణ , నిరంతర సాధన . 1966 డిసెంబర్ లో శ్రీ కోదండపాణి గారు కబురు పంపారు . ఏదయినా ఓ పాట పాడమన్నారు . తనే వ్రాసి స్వరపరిచిన ` రాగమూ అనురాగము ' అనే పాటని పాడారు బాలు . మరొకటి పాడమన్నారు . తనదైన శైలిలో పాడారు బాలు పాత్రలో గాత్రాన్ని మమైకం చేయగలగడం తండ్రి గారి హరికథల వలన అబ్బిన విద్య మరి . ఆ పాడే పద్దతి నచ్చింది కోదండపాణి గారికి . శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ చిత్రంలో వీటూరి గారు వ్రాసిన ఏమి వింత మోహం ... బాలు గారి తొలి సినిమా పాటగా పల్లవించింది . అదీ ఆరంభం ...క్రమేణీ పాడిన ప్రతీ పాటలోనూ సంగీతానికి, సాహిత్యానికీ , సన్నివేశానికీ న్యాయం చేకూరుస్తూ , సన్నివేశబలానికి తగిన నటనని గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటిస్తూ వీటూరి , ఆరుద్ర , శ్రీశ్రీ , కృష్ణశాస్త్రి, ఆత్రేయ , వేటూరి సీతారామశాస్త్రి , వైరముత్తు వంటి మంచి సినీకవుల హృదయ స్పందనలను తన గుండెలో దాచుకుని గొంతులో పలికిస్తూ సుమారు నలభైవేల పాటలను , తెలుగు , తమిళ , కన్నడ , మళయాళ , హిందీ , తులు , ఒరియా , అస్సామీ , బడగ , సంస్కృత , కొంకిణి , బెంగాలి , మరాఠీ ,పంజాబీ , ఇంగ్లీష్ వంటి 11 భాషలలో పాడారు . నలభై సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు .

1981 ఫిబ్రవరి ఎనిమిదిన ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు 17 పాటలు పాడి రికార్డ్ సృష్టించిన శ్రీ బాలు తరువాత ఒకే రోజులో 19 తమిళ పాటలు రికార్డ్ చేసారు . హిందీలో ఒకే రోజున 16 పాటలు పాడి ఘనత వహించారు .

యిది గాయకుడిగా ఎస్.పి.బాలు విశ్వరూపం .
వివిధ పాత్రలలో నలభై అయిదు సినిమాలలోనూ చానల్స్ లోనూ పాత్రోచితంగా నటించారు.
ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి 29 సార్లు నంది అవార్డులని, కలైమామణి , విశ్వగానయోగి , విశ్వగానయోగి , నాదనిధి , గానగంధర్వ వంటి బిరుదులనీ పొందారు. 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ , 2009 లో సత్యభామ యూనివర్సిటీ వీరిని డాక్టరేట్ తో గౌరవించాయి .

భారత ప్రభుత్వం 2001 లో ఈయనకి పద్మశీ యిచ్చి గౌరవించింది . 2011 లో పద్మభూషణ్ యిచ్చి ఆ గౌరవాన్ని మరింత పెంచింది . ప్రతిభాపాటవాలని మించిన మంచితనం మానవీయత , మృదుస్వభావం , ఔదార్యం, బొండుమల్లెలవంటి నిండైన నవ్వు , ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన మనిషితనం ...శ్రీ బాలు గారి స్వంతం .

వీరి శ్రీమతి సావిత్రి గారు , కుమారుడు చరణ్ , కుమార్తె పల్లవి .

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట . నిండయిన తెలుగుతనాన్ని వర్ణించే వాక్యంలో మొదటి మూడు పదాలూ కృష్ణశాస్త్రి కవిత , బాపూ బొమ్మ , బాలూ పాట...
ఈ పద్మభూషణుడి కోసం ....భారతరత్న ఎదురు చూస్తోంది .
సర్వేజనా సుజనోభవంతు
సర్వేసుజనా సుఖినోభవంతు
శుభం జయం సదా సర్వదా ......
గాన గంధర్వుడికి జన్మదిన శుభాకాంక్షలు...

---ఆచాళ్ళ శ్రీనివాసరావు

Saturday, May 7, 2011

ప్రాణధారనే పంచింది పాలబువ్వ తినిపించింది ...



పల్లవి :
అమ్మ కడుపులో హాయిగా ఆరంభమైన గమనం
మట్టిగుండెలో ఛాయగా నిదురించు వరకు పయనం
నేనడగకనే దొరికిన వరమే అమ్మా ! ఈ జన్మ
జన్మజన్మకీ నిన్నే అమ్మగ వరమిస్తే చాలు బ్రహ్మ
చరణం :
ఆ సూర్యుడైనా ఏ పొద్దయినా నిద్దుర లేచాడా ?
సుప్రభాతమై అమ్మ పాటేదొ తట్టి లేపకుండా !
చందమామ ఒక క్షణమైనా చల్లగా కునుకు తీసిందా ?
మబ్బుల ఒడిలో జోకొట్టే అమ్మ జోల వినకుండా !
చరణం :
కడుపు మాడ్చుకుని కన్న బిడ్డలకి కడుపు నింపు తల్లి
తన కంటిపాపలో చంటిపాపలా సాకు కల్పవల్లి
కలల తేరుని విరుల తీరాల చేర్చే అల అమ్మ
గుండె అలజడిని అమృతధారగ మార్చే వరమమ్మ
చరణం :
ప్రాణధారనే పంచింది పాలబువ్వ తినిపించింది
మనిషిగా జీవించమని మరీ మరీ దీవించింది
నుదుట ముద్దాడి లాలించే అమ్మే తోడుంటే
నుదిటిరాతనే మార్చి వ్రాయగల సత్తా మనవెంటే ...
ఆ అమ్మ జన్మ సార్థకమవదా మనుషులుగా మనముంటే ...

( మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకి ప్రేమ తో ..)

Thursday, February 3, 2011

తెలుగు భాష

అమృత ధారల తేనెల సోనల
తడిసిన స్వర వీణ
పలికే పదముల పులకించని ఎద
కలదా భువనాన
ఆ వీణ మన తెలుగు భాష
రస రమ్య శ్రీ రాగ యోష ...