Monday, October 25, 2010

cry in the wilderness !

అమ్మా నాన్నా అక్కా అన్నా ఉపాధ్యాయులారా

అల్లి బిల్లీ కబురులలో మా మొరలను వినలేరా !
మా బాల్యం గాలిపటానికి మీ ఆశల సంకెలలేలా?

మా ఊహల రంగుల దారం కొస ఇదిగో అందుకొలేరా !

చ ౧ :భవితంటే బడి చదువొకటే అనుకొంటూ మీరుమ్టే

మీకోసమ్ మేం మిమ్మల్నే ప్రతిరోజూ మిస్సవుతుమ్టే
మూడు మల్లెలెత్తు సుకుమారులము

ఎన్ని యాతనలు మోసెదము ? //౨సార్లు//

చ : చందమామ కధలే చెబుతూ తాతయ్యే జో కొడుతుంటే

ఊ కొడుతూ నిదురోతాము హాయిగా తీయగా
home work
భూతమల్లే కలలోనూ భయ పెడుతుంటే

ఉలిక్కిపడి లేస్తుంటాము బేలగా బేజారుగా ..
ఏమి చెప్పమమ్మా మా యాతనలెన్నంటే ..

.

.గెలుపంటే మార్కుల వరుసన మొదటి పేరు అనుకుంటే

అరిస్టాటిలూ ఐనిస్టియనూ కుడా ఓడినట్లే

టెమ్డూల్కరూ రామానుజన్ ఎన్నడూ గెలవనట్టే

గెలుపంటే ఒక ఆనందం గెలుపంటే ఒక అభిమానం

చెరగని సిరి చిరునవ్వులకి చిరునామా అవడం గెలుపంటే

.. దారిని బ్రతుకున చూపే సిరిదీపం ఈ చదువంటే ...


-
మన్ను తడి తాకద్దంటే మాను గా ఎదిగేదేలా ?

ఆకాశం చూడొద్దoటే ఆ ఎత్తుకు ఎగిరేదేలా ?

మట్టి తో చుట్టరికాన్నీ మబ్బుతో మా స్నేహాన్నీ

దూర౦ చేసి దగ్గర కొచ్చే tuition fashion దేనికనీ

గెలుపులో ఆన౦దాన్నీ ఓడినా sportiveness నీ

మా దరి చేర్చే ఆటల 'సాయం' దూరమయీ !!

బాల్యం లో ఆట పాటలు భవితకి బంగారు బాటలు

మా బాల్యం మాకివ్వండి

ఆనందంగా చదివేస్తాం మా సత్తా చూపిస్తాo

ప్రియ భారతి ముద్దు బిడ్డలై దేశానికి పనికొస్తాం

Monday, October 11, 2010

మానస చైత్రం


చైత్ర మాసం, పశ్చిమాన పవళించిన ప్రద్యోతనుడు మేఘాల కనురెప్పలు తెరచి, కిరణాల కరాలు సాచి లోకాన్ని సాకక మునుపే శశి చల్లని చూపులకే మేను మరచిన చిరుగాలి ముగ్ధత్వాన్ని సంతరించుకున్న మల్లె మొగ్గల్ని పరామృశిం చే వేళ దూరంగా కోనేటి గట్టున ఓ నందివర్ధనం రాలి పడిన సవ్వడిని సంగీతంగా మార్చుకున్నట్టు,కదిలే నీటి అల ఏ హృ దయ లయనో పలికిస్తే పదాలు కూర్చుకున్నట్టు,దూరంగా గుడి ప్రాంగణం నుంచి సుప్రభాత గీతాలు వినిపిస్తున్నాయి. 'సాగర కెరటాలలో సంగీతం నా నువ్వే, వెన్నెల కిరణాలలో వెలుగు రేఖ నీ నవ్వే' అని ఎప్పుడో వ్రాసుకున్న పాటని శృతించుకుంటూ నడుస్తున్నాను.

రైల్వే స్టేషన్ కి చేరి ప్లాట్ఫార్మ్ టికెట్ తీయడం కోసం పర్స్ తీస్తే సూర్యం నుండి అందిన ఉత్తరం. వ్రాసే ప్రతి అక్షరంలోనూ ఆర్ద్రతలో లేఖినినద్ది విరచించిన హృదయ విపంచికా గీతాలని చిత్రించడం ఇతని శైలి. సెలవులిచ్చినప్పుడల్లా అతడు రావడమో నేను వెళ్ళడమో . ఈసారే కలిసి ఆరు మాసాలు దాటింది. అదే వుత్తరం వ్రాసాడు వస్తున్నాననీ స్టేషన్ కి మ్మనీ... టికెట్ తీసుకుని ప్లాట్ఫాం మీద సందడి లేనిచోట నిలబడి ఆ ఉత్తరాన్ని మళ్ళీ చదవడం ప్రారంభించాను.

తెల్లని కాగితంపై ఊదారంగు అక్షరాలు...నింగికొసలలో నిత్య మల్లెలు పేర్చినట్ట్లు అందంగా,ఆనందం మనసైన చందంగా...'యోగీ ! పలుకని వేణువులా శృతి మరిచిన వీణియలా ఏమిటీ మౌనం. తొలి వయసు వేగంలో జలపాతపు హోరునీ జోరునీ సంతరించుకున్న నిన్నేనా,నులివేడి న్నీ టి సెలయేటి స్తబ్ధత ఆవరించుకున్నది? అమ్మ ఒడిలో అందుకున్న ప్రేమ వయసుతో బాటు పెరిగీ ఒక దశలో ఒక అమ్మాయి వైపు దిశ మార్చుకుందనీ తెలుసు. కానీ ....ఇదంతా నీ పాతికేళ్ళ వయసు నాటి సంగతి. ప్రేమ వైఫల్యం...అది కలిగించిన వేదన...ఎక్కడో నువే అన్నట్టు 'తొణికిన స్వప్నం కనుకొలకులలో బిందురూపమున చిందులాడినా...'ప్రతీ బిందువుకీ అక్షర రూపాన్నిచ్చి,ఆవేదనకీ అపురూప రూపాలనిచ్చుకుంటూ స్నేహితుల సమక్షంలోనో, ఏకాంతంలో సాహిత్యపు సానిహిత్యంలోనో...ఒక నవ్వు పూసినా ఎదనొక్క మధురాక్షరమై పరవశాల పల్లకిలో పదమల్లికలు పరచి, సురభి సుగం ధాలు పూసి కవితా సఖిని ఊరేగించిన నీలో ఎందుకింత స్థబ్ధత ?

ఒక్కమాట చెప్పనా? దేవులపల్లి వారన్నట్లు 'బాధ ఒక వరం' అవును ఆ బాధని మధురం చేసేందుకు పదాలని పీయూష విప్రూషాలుగా మలచుకో. ప్రేమని వ్యక్తి మీద నుంచి వ్యవస్త పైకి ఫొకస్ చేయి. విశ్వ జనీనమైనది ప్రేమంటే.కులాల ఎల్లల మద్య సంసారపుగోడలు లేచో,అర్ధిక సంబంధాల చట్రాలలో వివాహ వ్యవస్త ఇరుక్కుపోయో ఆడా మగా కలిసి బ్రతకలేకపోవడం కాదు ప్రేమ వైఫల్యమంటే. వ్యక్తి వ్యధతో సంఘాన్ని పట్టించుకోకుండా ఇంట్రావర్ట్ గా కుమిలిపోవల్సిన విషయం కాదు అసలు ప్రేమలో వైఫల్యమంటే, కత్తిపోట్లూ, బాంబుబ్లాస్ట్లూ, ఆత్మహత్యలూ, ఆకలిచావులూ, మారణహోమాలూ.. అదీ ప్రేమరాహిత్యమంటే. ఎన్నికల ముందు మందు ఏరులై పారడాలూ రాజకీయాలూ శవాలపై ఏరుకునే ఓట్లూ,...ఇవీ ప్రేమరాహిత్యమంటే...అహింసాయుధం స్థానం లో మరఫిరంగులు మ్రోగడం,శాంతికపోతం గుండెలలో కత్తులు నెత్తురు చిమ్మడం, పరాకాష్టకి చేరుకున్న స్వార్ధం..ప్రేమ వైఫల్యం అంటే....

ఉత్తరం ఇంకా పూర్తి కాలేదు ఈలోగా రైలు ప్లాట్ఫార్మ్ ని సమీపిస్తున్న హడావుడి. కాఫీ సెగ మేళవించిన ప్రభాత వార్తాపత్రికల గుభాళింపు అలసటగా దిగేవాళ్ళూ హడావుడిగా రైలెక్కేవాళ్ళూ పోర్టర్లూ టికెట్ కలెక్టర్లూ పందోంపుల్లలూ ఫలహారాలూ ఆరాటం హడావిడీ అత్తగారు ఊర్లోలేనప్పుడు ఆకస్మికంగా ఆయనవైపు బంధువులొచ్చిన వంటరాని కొత్తకోడలి వంటిల్లులా వుంది ప్లాట్ఫాం.సూర్యం రాలేదు. రైలు కదిలేవరకూ చూసి వెనుదిరిగాను.

ఉత్తరంలోని మాటలే వెన్నాడుతున్నాయి.నిజమే! వ్యక్తిమీది ప్రేమకోసం వ్యవస్థ ని నిర్లక్ష్యం చేయడం సంఘపరంగా నేనిన్నాళ్ళూ చేసిన ద్రోహమేనేమో...కవిగా రచయితగా అంతో ఇంతో రాణింపూ గుర్తింపూ వుండికూడా విషాద గీతాలూ ప్రేమకధలూ తప్పితే సామాజిక స్పృహ వున్న వేమి వ్రాసాను ఫైలింగ్ ఎంతున్నా వృత్తిని మాత్రం ఏంపట్టించుకున్నాను?

...ఆలోచనల తోడుగా ఇంటికి చేరుకున్నాను. పక్కింటి వాకిట్లో పనిమనిషి కళ్ళాపి జల్లి ముగ్గేస్తోంది. ఎదురింటి సుబ్బారావు అప్పుడే వచ్చి తూలుకుంటూ తలుపుకొడుతున్నాడు. నేను తలుపు తాళం తీసి కాఫీ కలుపుకుంటుంటే అమ్మ గుర్తుకొచ్చింది.కళ్ళు విప్పగానే కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యే అమ్మ..పెళ్ళిచేసుకోమని శతపోరి విసిగి మార్పుకొసం అన్న దగ్గరకి వెళ్ళిపోయిన అమ్మ. కాఫీ తాగి స్నానాదులు ముగించి వీధిలోకి వచ్చేసరికి ఎదురింట్లోంచి అరుపులూ కేకలూ వినిపిస్తున్నాయి. ఎదురింటి సుబ్బారవు తరచు తాగొచ్చి ఇలాగొడవ పడడం మామూలే.

సుబ్బారావుది మునిసిపల్ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం. నీటో నాటో రోజూ మందుకొట్టడం, మరీ ఎక్కువయితేనో,డబ్బులు తక్కువయితేనో భార్యని కొట్టడం అడ్డొస్తే తల్లిని తిట్టడం ...ఆ ఇల్లాలు ఏడ్చుకోవడం,తల్లి తల మొత్తుకోవడం,చుట్టుపక్కల ఎవరైనా సుబ్బారావు మైకంలో కాక ఈలోకంలో వున్నప్పుడు నచ్చచెప్ప యత్నించడం మామూలే..ఇదంతా మామూలే అని బయటకి వెళ్ళేందుకు బండి తీస్తుంటే వీధి మొగలో మలుపు తిరుగుతూ సబ్ ఇన్స్పెక్టర్ సుదర్సనం వెనకే ఓ కానిస్టేబ్లూ. ముప్పయి గడపలూ అరవై సంసారాలూ మించని చిన్న వీధి మాది. ఈ వీధిలో ఇంత ఉదయాన్నే పోలీస్ వాళ్ళకి పనేంటో అర్ధంకాలేదు నాతో ఏమయినా పనున్నా కాజువల్ పలకరింపులైనా ఫోన్ చేసివుండేవాడు కదా అనుకుంటూ ఆగాను.

ఇంతలోనే ఎదురింట్లోంచి కేకల తీవ్రత పెరిగింది."సచ్చినోడా ! నీ తాగుడు కాదు కానీ సంసారం గుల్ల అయిపోతోందిరా ! చంటిపిల్లాడికి చుక్కల మందు వేయించడానికి వెళ్ళడానికి రిక్షాకైనా డబ్బుల్లేవింట్లో,వంటి వంటిడు బంగారం నీ యధానే పెట్టిందది. ఇంకేమున్నాయని ఆ మెళ్ళో తాడూ,తాళిబొట్టూ తప్ప...అవీ ఇచ్చేయమంటావేరా బ్రష్టుడా..." అంటోంది తల్లి. "చుక్కలమందెందుకే ఆడు నా కొడుకు సుక్కేసి పెంచుతానాణ్ణి. ఆరొందలు అరువు పెట్టి కొన్నానే బాటిల్. పదోగంటకి షాపు తీసేసరికి ఇచ్చేయాల డబ్బులు లేకపోతే పరువూ దక్కదు మళ్ళీ అరువూ దక్కదు...దా ఆ తాళి ఇలా ఇచ్చేయి..రేయ్ కన్నా... నోరు తెరూ అంటున్నాడు సుబ్బారావు...కేర్ మన్న ఏడుపు వినిపించింది. ఇంక ఆగలేకపోయాను. బండి స్టాండు వేసి ఎదురింట్లోకి పరుగెత్తాను.

కానీ అప్పటికే ఆలస్యమయింది. సుబ్బారావు మెడ తెగి నేల మీద రక్తపు మడుగులో పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు, వుయ్యల్లో బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. పక్కనే తెరిచిన విస్కీ సీసా. చేతిలో కత్తి పీటతో నిశ్చేష్టురాలై అయోమయంగా నిలబడి వుంది సుబ్బారావు తల్లి. పక్కనే కొత్త మామిడికాయలు, కత్తిపీటకి పదునిచ్చింది మేమేననుకుంటూ...ఏవండీ...ఏవండీ ...తాళే కదండీ...ఇదిగోనండీ మీరుంటే చాలండీ... అంటూ మెడలో తాళి తీసి సుబ్బారావు చేతిలొ పెట్టి పిడికిళ్ళు మూస్తూ అయోమయంగా చూస్తోంది అతడి భార్య. ప్రేమమైకంలో పడి లోకంలో దేనికీ చలించని రాక్ హార్టెడ్ గా కుటుంబంలో ముద్ర పడిన నాకే ఆ దృశ్యం దుర్భరంగా భయానకంగా అయోమయంగా వుంది.

సూర్యం వుత్తరంలో మాటలే గుర్తుకొస్తున్నాయి. ప్రేమంటే వ్యవస్తని పట్టించుకోకపోవడం కాదు. alone in crowd and alone in solitude అనుకుంటూ విరాగిలా ఒంటరిగా జీవశ్చవంలా బ్రతకడం కాదు. తెరిసాకి సేవలో దొరికిన ప్రేమ, మార్క్స్ కి సామాన్యుడిపై వున్న ప్రేమ, సిద్దార్దుడిని బుద్దుడిని చేసిన ప్రేమ...అయిదు నిమిషాల ముందు లోపలకి వచ్చివుంటే అన్నప్రాసనైనా కాని బిడ్డ నోట్లో ఆల్కహాల్ పోసిన ఓ వ్యసన బానిస బ్రతికి కనిపించేవాడు. కోడలి తాళి తెంపే కొడుకుని,కన్న కొడుకు నోటిలో పాలసీసాకి బదులు మందుసీసా వుంచే మూర్ఖుణ్ణి అడ్డుకోవడానికి చేతిలో వున్న కత్తిపీట నెత్తిన ఓ తల్లి ఆవేశాన్ని ఆపగలిగే వాడిని.

అప్పటికే వచ్చిన పోలీసులూ ఆశ్చర్యంనుండి తేరుకుని.."సారీ బాస్ మైత్రీ సంఘం మీటింగ్ కి నిన్ను గెస్ట్ గా పిలుద్దామని వచ్చాం వుదయాన్నే మర్డర్ కేస్ తగిలింది...'అంటున్నాడు ఎస్.ఐ;ఇద్దరం యూనివెర్సిటీ లో రూంమేట్సం. నేనేమీ వినటం లేదు. సుబ్బారావు తల్లిని ఎలా రక్షించాలా అనే నా ఆలోచనంతా. అవును భారతీయ న్యాయ శాస్త్రం చాలా గొప్పది. దేశ ప్రధాని అధికార పరిధిని సైతం నియంత్రించగలిగినది. దేశ ప్రధానిని పట్ట పగలు కాల్చి చంపిన వారిని సైతం వురి నించి తప్పించగలిగినది. శిక్షా స్మృతి లో ఓ చాప్టర్ గుర్తుకొచ్చింది. గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్... పరవాలేదు పార్వతమ్మ గారిని శిక్ష నుండి తప్పించవచ్చు లేదా వీలయినంత చిన్న శిక్ష పడేలా ప్రయత్నించవచ్చు. సుబ్బారావు భార్యకి ఏదయినా ఆధారం కోసం ప్రయత్నించాలి. కానిస్టేబుల్ ని అక్కడే వుంచి అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి ఎస్.ఐ నేనూ ఇంటికి వస్తే ..ఫోన్ బల్ల మీద తెరచిన వుత్తరంలో చివరి పదాలు a word from a writer's lit brain is but a golden grain అవును ఈ సంఘటననే కధ గా మలిస్తే...విశ్వవ్యాప్తం కాలేక కేవలం వ్యక్తి పరమైన ప్రేమ కూడా స్వార్ధమేననీ బ్రతుకుని అస్తవ్యస్తం చేస్తుందనీ...మనిషి మీదనయినా మద్యం మీదనయినా ...మమకారం వ్యసనమయితే వ్యక్తినే కాక వ్యవస్తనే అవస్తలపాలు చేస్తుందనీ ఎవరికి అర్ధమయినా చాలు...మానస చైత్రాలు విరియడానికి...

***