Saturday, August 3, 2013

మృత్యుం (న) చమే ....

     


   జీవితం సుందరమైన , సుమధురమైన అనుక్షణం ఆస్వాదయోగ్యమైన ఓ స్వప్నం .
మరణం - భయంకరమైన బాధాకరమైన కోరి ఆహ్వానించ  తగని ఓ సత్యం  ! 
ఈ మద్య  ఓ కాఫీ సాయంత్రం ఓ మిత్రుడి నుంచి ఫోను - ` అమ్మ పోయింది పావుగంట అయ్యింది ' అని . అతని గుండెల్లో బాధ నాకు తెలుసు , గొంతులో చిన్న రిలీఫ్ కూడా తెలుస్తోంది . మరో పావుగంటలో అతడి దగ్గర వున్నాను . జేబులో పర్స్ , చేతిలో సెల్లూ మరచిపోకపోవడం  నా ప్లానింగ్ కి నిదర్శనం కాదు , అనుబంధాలపై అవసరాలు చెలాయించే పెత్తనానికి ఓ ఋజువు మాత్రమే .నేను వెళ్ళే సరికి కుటుంబసభ్యులు తొమ్మండుగురు కాక - చుట్టుపక్కల యిళ్ళ వాళ్ళు కొద్దిమంది వున్నారు . ఎక్కాడా ఏడుపులూ పెడబొబ్బలూ లేవు . ఎనభై ఏళ్ళు దాటాక కేవలం కొద్ది గంటలు మాత్రం ఆస్పత్రిలో వుండి కన్నుమూసిన ఆవిడ జీవితపు నిష్క్రమణ క్షణాలలో నిశ్శబ్దంగా ప్రార్దిస్తున్నారు . అందరి హృదయాలలోనూ బాధ వుంది , ఆ వయసులో ఎక్కువ యాతన పడకుండా సునాయాస మరణాన్ని పొందగలిగిన అదృష్టం పట్ల కాస్త రిలీఫ్ వుంది . ఆవిడ రామాయణ , భారత భాగవతాలు, భగవద్గీత , ప్రతీ రోజూ తెలుగు పేపరూ తప్ప ఏమీ చదువుకోలేదు . ఓ మద్య తరగతి కుటుంబంలో స్త్రీ అనుభవించే అన్ని రకాల కష్టాలనీ చాలా సహనంతో నేర్పుతో అధిగమించింది . పిల్లలనీ మనవలనీ కనీసపు సౌఖ్యాలతో ప్రశాంతంగా గౌరవంగా బ్రతకగలిగేలా ముఖ్యంగా వారిచుట్టూ వుండే సమాజానికి వీలైనంత ఉపయోగపడేలా తీర్చిదిద్దింది . మరణానికి ఒక్కరోజు ముందు పేపర్ లో నేత్రదానానికి సంబంధించిన వార్త చూసి  ` నేను పోయాక నా కళ్ళు ఎవరికయినా యిచ్చేసే ఏర్పాటు చేయి నాయనా ' అని కొడుక్కి చెప్పింది . నేను వెళ్ళిన మరో మూడు గంటలలో ఆ కార్యక్రమాన్నీ పూర్తి చేయగలిగేం . ఈ పాటికి ఆ కళ్ళు మళ్ళీ ఈ లోకాన్ని చూస్తూనే వుండి వుంటాయి . పెద్ద కొడుకు పెళ్ళయిన అతికొద్ది రోజులలోనే ఏదో ప్రమాదంలో మరణిస్తే ...పదహారురోజుల పండుగయినా కాని కొత్త కోడలిని రాచిరంపాన పెట్టి కడుపున పెట్టుకోలేదు , కడుపులో పెట్టుకుని చూసుకుంది . కొన్నాళ్ళ తర్వాత భర్త మరణించినా మిగిలిన పిల్లల్నీ మనవల్నీ తీర్చిదిద్దడంలో ప్రదానపాత్ర తానే అయింది . మృత్యువే తనకు తానుగా వచ్చి  దేహీ అన్నప్పుడు సాఫల్యమైన జీవితపు పరిపూర్ణ పాత్రని ఆమె ముందుంచి నిశ్శబ్ధంగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది , గమనించండి మృత్యువుని స్వయంగా ఆహ్వానించి కాదు . యిది సగటు మనిషి మరణానికి ఓ సుందరమైన పార్శ్వ్యం , జీవితానికి ఓ సాఫల్యమైన ముగింపు . 
కానీ అన్ని మరణాలూ ఒకే పార్శ్వ్యంతో వుండవు  ... అన్ని జీవితాలకీ ముగింపు ఒకేలా వుండదు . సుమారు యిదే సమయంలో పత్రికలలో ... విదేశాలలో చదువుకుని ముంబై లో స్థిరపడి భారత దేశపు అగ్రశ్రేణి కధానాయకుడి సరసన మొదటి సినిమాలోనే అవకాశాన్ని చేజిక్కించుకుని అపురూపమైన విజయాన్నీ చవిచూసిన ఓ నటి స్వీయ మరణ వార్త ....నాకెందుకో క్లియోపాత్రాని గుర్తు తెచ్చింది . సర్వాంగ సుందరంగా అలంకరించుకుని పాము చేత కాటు వేయించుకుని మరణించబోయే క్షణంలో " ....The stroke of death is as lover's pinch / which hurts and is desired .."  అనుకున్న క్లియోపాత్రా . ప్రతీ ప్రేమ కథకీ ముగింపు విషాదమే ... అన్నారో సినీ కవి కాకపోతే కొన్ని ప్రేమకథలు పెళ్ళితో కూడా ముగుస్తాయి అదింకా విషాదం అంటాడో మిత్రుడు కాసింత సర్కాస్టిక్ గా . యిరవైయవ శతాబ్ధపు చిత్రకారులలో ప్రపంచంలో అగ్రగామిగా ' క్యూబిజం ' కి ఆద్యుడిగా ప్రసిద్దిగాంచిన పికాసో వెర్రి మొర్రి చేష్టలనీ చిత్రహింసలనీ భరించలేక ఆయన నలుగురి భార్యలలో ఒకరైన వాల్టర్ ఆత్మహత్య చేసుకుంది , మరో భార్య జాక్విలిల్రొక్ రివాల్వర్ తో కాల్చుకుని చచ్చిపోయింది .మిగతా భార్యలూ ప్రియురాళ్ళ సంగతి భగవంతుడి కెరుక . 
మనం చరిత్ర పాఠాలు నేర్చుకుంటాం కానీ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోం .
కేవలం గత సంవత్సరం అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలోనే  నలభై అయిదువేల మందికి పైగా మహిళలు ఆత్మ హత్య చేసుకున్నారు . సగటున రోజుకి నూట యిరవి తొమ్మిది మంది మహిళలు . వ్యక్తిగత కారణాలు , భావోద్రేకాలు ఈ మహిళల ఆత్మహత్యలకి ప్రధాన కారణాలు కాగా వీరిలో 67.9 శాతం వివాహితులు . ప్రతీ ఆరు ఆత్మహత్యలలోనూ ఒకటి గృహిణిది గా గుర్తించబడింది .
మనిషి పుట్టుకకి మోహావేశం కేవలం ఓ భౌతికమైన కారణం కావచ్చు కానీ అంతర్గతమైన అంతిమకారణం మరోటుంటుంది . దానిని వెదుక్కుంటూ జీవన సాఫల్యాన్ని సాధించడానికి మనిషి బ్రతికి తీరాలి . 
శంకరాచార్య , క్రీస్తు , కీట్స్ , శ్రీనివాస రామానుజన్ , ఈ తరంలో కల్పనా చావ్లా ...వీరిలో ఎవ్వరూ తమ నలభైవ పడిని చూడలేదు కానీ కొన్ని వందల సంవత్సరాలకి సరిపడా సాధించి జీవన సాఫల్యాన్ని పొందారు . కారణం చాలా చిన్నది వీరెవ్వరి ప్రేమా కేవలం వ్యక్తి పట్ల కాదు . ఓ ధర్మం పట్ల , వ్యక్తుల పట్ల , ఓ భావం పట్ల , సిద్ధాంతం పట్ల , శాస్త్రం పట్ల , మొత్తం మానవాళి పట్ల .
బ్రతకడం ఒక కర్తవ్యం. దానిని విధిలేక కొనసాగించకూడదు , అనుక్షణం ఆస్వాదిస్తూ  ఆనందంగా నిర్వహించాలి . అసలీ ఆత్మహత్యల వెనుక మౌలికమైన కారణం ప్రేమ కాదు , వారి జీవితం పట్ల వారికి ప్రేమ లేకపోవడం . చదువు , ఉద్యోగం , ప్రేమ , పెళ్ళి ,వైఫల్యాలు , అప్పులు , అవమానాలు ....కారణాలేమైనా మనిషికి  తన జీవితం కంటే ఎక్కువ కాదన్న ఒక్క నమ్మకాన్ని , కోల్పోయిన వేటినయినా తిరిగి పొందవచ్చు ఒక్క జీవితాన్ని తప్ప అనే అవగాహనని చాలా చిన్న వయసునుంచే ఈ తరంలో కల్గించవలసిన నైతికమైన బాధ్యత అందరిపైనా వుంది . కాకుంటే గంటకి పదిహేను గా నమోదయిన ఆత్మహత్యల రేటు సెకనుకి ఒకటిగా మారడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు . వృద్దించమే , వృద్దంచమే అని భగవంతుని వేడుకున్న చమకకారుడు కూడా మృత్యుంచమే (మరణాన్నివ్వు)  అని వేడుకోలేదు. ఎందుకంటే ఈ మద్యనే సీతారామశాస్త్రి గారు చెప్పినట్లు బ్రతకడం  ఓ కర్తవ్యం . 
బ్రతుకంటే అమ్మ ఒడి  బ్రతుకంటే కాదు అలజడి 
బ్రతుకంటే నాన్న ఎద సడి బ్రతుకంటే కాదు మృతి ఒడి 
ఆకులు రాలిన శిశిరం కొసలో తరువు తనువు చాలిస్తుందా 
ఆశల చిగురులు పోగుచేసుకుని ఆమనిగా విరబూస్తుందా 
ఆ మానుకున్న ఆశాదృక్పధం మనిషికి లేకుందా 
సృష్టినింక ఏ ప్రాణికైన ఆహ్వానమరణముందా  ....
ఎప్పుడో వ్రాసుకున్న పాటలోని ఆఖరి చరణం ఈ కాలం కి ముక్తాయింపు .
' కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ సమాః ..." కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నిండు నూరేళ్ళూ బ్రతకమన్న ఉపనిషత్ వాక్యం ముగింపు .   


http://vihanga.com/?p=9548





--













Wednesday, June 5, 2013

మొక్కే దేవతలు

 ఈ ఏప్రిల్ పదమూడవ తేదీన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మొదటి పుటలో ప్రచురించబడిన ఓ వార్త నన్ను ఓ ఉల్లాస ఉన్మత్తతకి గురిచేసింది. ఆనందం మారు రూపులో పరామర్శించింది.  రాజస్తాన్ లోని ఓ గ్రామంలో పుట్టిన ప్రతీ బాలిక పేరా నూటపదకొండు మొక్కలు నాటుతారనీ , అలా నాటిన మొక్కలు యిప్పటికి సుమారు అర్థమిలియన్ దాకా ఉన్నాయనీ.. అలాగే ఆడపిల్ల పుట్టిన వెంటనే తండ్రి దగ్గర పదివేలరూపాయలు తీసుకుని బంధువర్గం,గ్రామపంచాయితీ కలిపి మొత్తం యిరవైఅయిదువేల రూపాయలు ఆ బాలిక పేర యిరవై సంవత్సరాలకి డిపోజిట్ చేస్తారనీ అలా చేసేముందు ఆ బాలికకి చట్టపరమైన వివాహయోగ్యతా వయసు వచ్చేవరకూ ఎటువంటి పరిస్థితులలోనూ వివాహం చేయనని  ఆ బాలిక తండ్రి నుండి ఒప్పందపత్రం తీసుకుంటారనీ ఆ వార్త సారం . అద్భుతమైన ఆలోచన , అసాధారణమైన ఆచరణ .
    సుమారు దశాబ్ధం క్రితం వ్రాసిన ఓ పాటలోని చరణం – `ప్రతివోడూ ప్రతియేడూ ఒక్క మొక్క నాటి వుంటే , పుట్టే ప్రతిబిడ్డకొక్క మొక్క లెక్క నాటివుంటే ,నేలతల్లి గుండెకింత కోతమిగిలి వుండేదా , సముద్రాల గర్భంలో యేడి రగిలివుండేదా ..’ అని శృతించుకుంటూ ఆ పాట ప్రభావంలో కొన్ని సంవత్సరాల తరువాత కూడా తమ కుమార్తెల మొదటి పుట్టినరోజు వేడుకలలో తిరుగు బహుమతులుగా మొక్కలని కాగితం సంచులలో పెట్టి వచ్చినవారందరికీ అందించిన యిద్దరు  ఆత్మీయ సహచరులని స్మరించుకుంటూ … ఆ ఆంగ్ల  దినపత్రిక లోని వార్తని ఓ మిత్రుడి  ముందుంచాను . కడివెడు నీళ్ళకోసం క్రోసుల దూరాన్ని నడవాల్సొచ్చే రాజస్థాన్ లో ఈ ప్రయోగం ఆహ్వానించదగిన సానుకూల దృక్పథమున్న పరిణామమే కానీ యిరవయి సంవత్సరాల తర్వాతైనా ఆ బాలికలు ఆ సొమ్ముని వారికి నచ్చినట్లు వినియోగపరచుకోగలిగే స్వేచ్చ ఈ దేశంలో వస్తుందంటారా … ? అని ప్రశ్నించాడు ఆర్థికశాస్త్రంలో ఉన్నతపట్టా పొంది సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఆ మిత్రుడు .  ఎగిసిపడిన ఆనందపుటార్ణవ కెరటం  ఒక్కక్షణంలో పడి విరిగింది . మానవుడు ఆశాజీవి అన్న ప్లాటో ని గుర్తుచేసాను . కానీ  అణుబాంబుని కనిపెట్టిన హట్టోహాన్ లా కనిపించిన ఆ మిత్రుడు బాంబ్ పేల్చాడు … రామారావు కి వాళ్ళావిడ  విడాకుల కాగితాలు పంపిందని . మానవ సంబంధాలు హృదయమాధుర్యాలని నమ్మే భావుకతా మూలాలని వదలలేని నేను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెబుతున్న ఆ మిత్రుడి వాస్తవిక ధోరణిని త్రోసిరాజనలేని వాస్తవం , మూడుముళ్ళేసి మూడు సంవత్సరాలు నిండీనిండక విడాకులవరకూ వెళుతున్న రామారావు వైవాహిక వైఫల్య స్థితి .

 ఏడాదిన్నర  క్రితం అనుకుంటా పాప పుట్టిందని రామారావు సహొద్యోగులందరికీ విందు  చేసాడు , కొన్ని నెలల తరువాత వాళ్ళవిడకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చాలా ముక్తసరిగా మొక్కుబడిగా స్వీట్లు పంచాడు . పందొమ్మిదేళ్ళ వయసుకే అతనికో పిల్లని కనిచ్చినందుకు సంతోషించిన రామారావు , అంతచిన్న వయసులో అతనికంటే ముందుగా అతను సాధించలేకపోయిన ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన భార్యని మనస్పూర్తిగా అభినందించలేకపోయాడని అతను తెచ్చి పెట్టుకున్న నవ్వే చెప్పింది . అతనిచ్చిన మిఠాయి చేదుగా అనిపించింది మాటని మనసులో దాచుకోగల నేర్పు నాకు లేదు . ` నా భార్య వయసు నా వయసులో ముప్పాతికకి కొద్దిగా ఎక్కువ , నా జీతం ఆవిడ జీతంలో ముప్పాతిక కంటే తక్కువ , అర్థసత్వాలు అన్యోన్యతకి అవరోధాలు కాకూడదనీ ,భార్య ఉన్నతిని ఆత్మనూన్యతగా భావించవద్దనీ  హాయిగా వుండమనీ  చెప్పాను . కొన్నాళ్ళు బాగానే వున్నారు . ఆ అమ్మాయి తండ్రి విత్తనం నాది కాబట్టి ఆ ఫలాలపై పెత్తనం నాది అన్నట్లుగా ప్రవర్తించాడు .  నా వాకిట్లో చెట్టుపై సర్వాధికారాలు నావికావాలన్నాడు భర్త . ఆ అమ్మాయి రోజూ తండ్రితో కలిసి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేది , రాత్రయేసరికి భర్త యింటికి చేరుకునేది . ఎ టి ఎం కార్డ్ మాత్రం తండ్రి పర్సులో భద్రంగా వుంది . రెండేళ్ళు తిరగకుండా పెళ్ళి పెటాకులదాకా వచ్చింది , పసిపిల్ల భవిత ఓ పవల్లిక . ఆ అమ్మాయి జీతం ఏ మేరకు ఎవరి కొరకు ఖర్చు చేయాలన్న విషయం లో ఆమె ప్రమేయం ఏమీలేదు . ఎప్పుడో ఓ సారి వీరలక్ష్మి గారన్నట్లు నిజంగా ` స్త్రీకి సంపాదించడానికి చాలా స్వేచ్చ వుంది నచ్చినట్లు ఖర్చుచేయడానికి లేదు .

 మరో పదిరోజుల తర్వాత వున్నట్లుండి మా సాంఘిక శాస్త్ర బోధకుడు వున్నపళంగా రెండురోజులు సెలవు కావాలన్నాడు , వాళ్ళావిడ రికార్డ్లు వ్రాసిపెట్టడానికి ఒక రోజు , ఆ రికార్డులకి అవసరమైన ఏభయి రకాల ఆకులు , కొమ్మలు సేకరించడానికి ఒక రోజు . ముచ్చటేసింది . ఆర్థికంగా కొత్తగా కలిగే వెసులుబాటు ఏమీ లేకపోయినా సరే భార్య ఆమెకి యిష్టమైన రంగంలో ఉన్నతిని సాధించడానికి తన సంపూర్ణ సహకారన్నందించే అతడి సంస్కారం ఆ ముచ్చటకి మూలం . ` సాయంత్రం మా యింటికి రండి , మీరు కాఫీ తాగేలోగా ద్రాక్షతో సహా మీకు కావల్సిన అన్ని రకాల ఆకులూ కొమ్మలూ నేనిస్తా’నన్నాను . సాయంత్రం నేనింటికి చేరేసరికి అతడు రాలేదు , అతని నుండి ఫోన్ వచ్చింది ` మీ కంటే ముందే మీ యింటికి వచ్చి కావల్సినవన్నీ కోసుకొచ్చేసాను , మీకు మొక్కలంటే అంతగా ఎందుకిష్టమో అర్ధం కాలేదు సార్ ‘ అని .

 ఓ చిన్న నవ్వే అప్పటి నా సమాధానం ఆ నవ్వుకి అర్ధం :

తమ ఉనికితో అందాన్నీ ఊహతో ఆనందాన్నీ యిస్తూ తాముండే  నేల మీద తాము ఆధారపడినట్లు కనిపిస్తూ నిజానికి ఆ మట్టి గట్టి తనమంతా మట్టిపాలు కాకుండా కాపాడుతాయి దీనినే సోయిల్ ఎరోజన్ అంటారనుకుంటా మీ జాగ్రఫీలో . పవిత్ర సవితృ కిరణతోరణం పత్రహరిత నేత్రాల ధారణం  నేలతల్లి గుండెలలో జీవం నింగి కొసల గాలులతో లీనం కాగా కదిలిన ఆమ్ల జని మానవ జీవన రసధుని అన్నాడయ్యా కవి . అంటే గాలి లో ని కార్బన్ డై ఆక్సైడ్ ని తాముండే నేలలోని నీటితో కలిపి సూర్యరశ్మి సమక్షంలో ప్రాణవాయువు గా చేసి మనకందిస్తాయని . మనకంటే ఎంతో ఉన్నతంగా వున్నా ఆకులతో ఆప్తాలింగనం చేసుకుంటాయి , శిరసు వంచి నమస్కరిస్తాయి , పువ్వులతో పలకరిస్తాయి , తిండిపెడతాయి …

 …అచ్చం స్త్రీమూర్తులలాగానే

తమచుట్టూ ఎన్ని విషవలయాలున్నా విశ్వవ్యాప్తమవుతున్న జ్ఞానాన్నంతటినీ  స్వంతం చేసుకుంటూ తమలో అంతర్లీనమైన వివేకంతో అమృతమయమైన ప్రేమనందిచినట్ట్లు , పుట్టింటిపైనో మెట్టినింటిపైనో ఆధారపడినట్లు కనిపిస్తూ నిజానికి వారికే ఆధారమౌతున్న స్త్రీమూర్తులు మొక్కలలాగే స్వయం సిద్ధలు . కానీ వారి సంస్కారం కారణంగా మనకి మొక్కే దేవతలు నిజానికి మనం మొక్కవలసిన దేవతలు ..అని

అందుకే మొక్కలని విరివిగా పెంచుదాం మహిళలని స్వేచ్చగా ఎదగనిద్దాం!

 శోభాయమానమైన లోకం  కోసం శుభకరమైన జీవితం కోసం  …..

http://vihanga.com/?p=8969

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Wednesday, May 8, 2013

నిర్వాణాష్టకమ్




నేను మనసుని కాను, మేధనీ కాను,అహాన్నీ,మనోజ్ఞానాన్నీ కాను; 
నేను దేహాన్నీ, దేహ పరివర్తనలనీ కాను; 
నేను దృశ్య శ్రవణ జిహ్వ ఘ్రాణేంద్రియాలనూ కాను, 
పృధ్వి,వాయు,ఆకాశ,తేజాలను నేను కానే కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను (శివోహం,శివోహం). 

నేను ప్రాణాన్ని కాను,పంచ ప్రాణ వాయువులనీ కాను; 
పంచేంద్రియ పేటికా పదార్దాలనీ కాను,పంచ కోశాలనీ కాను నేను; 
నేను కర్మేంద్రియాలనీ కాను, ఇంద్రియ జ్ఞానాన్నీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని,నేనే అతను (శివోహం,శివోహం). 

నేను అసహ్యాన్నీ అనుబంధాన్నీ ఎరుగను,ఆశనీ,మాయనీ కాను; 
అహంకారిని కాను,వైషమ్యాన్నెరుగను,ధర్మాన్ని కాను,మోక్షాన్నీ కాను; 
నేను కాంక్షని కాను,కాంక్షగొలిపే విషయాన్నీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

నేను పాపాన్నీ పుణ్యాన్నీ కాను,ఆనందాన్నీ అశ్రువునీ కాను; 
ఆలయాన్నీ కాను,అర్చననీ కాను,పుణ్యక్షేత్రాన్నీ,పవిత్రలిఖితాన్నీ కాను, 
ఆనందపు చర్యనీ,ఆనందింపదగిన వాడినీ,ఆనందించే వాడినీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

మృతి లేదు నాకు మరణ భీతి లేదు, కుల మతాలు లేవు, జాతి లేనేలేదు; 
నేనసలు ఏనాడు జన్మించనే లేదు,తల్లిదండ్రులు లేరు,బంధు మిత్రులులేరు; 
గురువు, శిష్యుడు నాకు లేనె లేరు; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

జ్ఞానాలచే నేను స్పర్శించబడలేదు,నేను ముక్తినీ జ్ఞానినీ కాను; 
ఆకృతీ,అవధీ,లేక కాలాంతరాళాల ఆవలి గట్టున నేను; 
సమస్తంలోనూ,సర్వంలోనూ విశ్వమూలాలలోనూ నేనే. 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణానందాన్ని- 
నేను అతడిని,నేనే అతను (శివోహం,శివోహం). 

The complete works of swami vivekanada vol-4 pp 391,392 నుండి స్వేచ్ఛానువాదం

Saturday, January 19, 2013

ద్వైతాద్వైతం


  వృద్దాప్యపు శిశిరంలో వసంతపు సందడి.18 వసంతాలు నిండిన పెద్ద మనవ రాలి పెళ్ళి హడావుడి.ఇల్లంతా తోరణాలు, మంగళ వాయిద్యాలు పందిట్లో అగరు పొగలు,అత్తరు వాసనలు,పట్టు చీరల రెపరెపలు.అంత హడావుడిలోనూ క్రీగంట చూపులూ,సైగలూ,కొంటె నవ్వులూ మరిచిపోని కుర్రవాళ్ళూ,పోస్ట్ మేనూ,ఫామిలీ డాక్టర్ తో సహా పిలిచిన అందరూ వచ్చినట్లే వున్నారు పెళ్ళికి. 

         పెళ్ళి పీట పక్కనే రెండు కుర్చీలు వేయించాడు పెద్దాడు. కూతురి పెళ్ళి తంతంతా పక్కనే కూర్చుని జరిపించమని. ఏమయినా నా పెద్ద మనవరాలు అంతా వాళ్ళ నాయనమ్మ పోలికే. పీటల మీద కూర్చుంటే పాపట చెందిరము కనుపాపల కజ్జల రేఖ... గళాన గంధపు పూత ...ఉహు... నా దిష్టే తగిలేలా వుంది పిల్లకి. సుమూహూర్తం దగ్గర పడుతున్నా నా పక్క కుర్చీ మాత్రం ఖాళీగానే వుంది. గాడి పొయ్యి దగ్గర అజమాయిషీయో పట్టు చీర సింగారమో... 


         ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం పెళ్ళికి అమ్మగారో అత్తవారో కొనడం తప్ప నేనెప్పుడూ ఓ పట్టు చీరైనా కొనిబెట్టెరుగను. యిదిగో యిప్పుదైనా పిల్లలు మరీ పట్టు బడితే తీసుకుంది. 


         శ్రీమతి పందిట్లోకి ఇంకా రాలేదు. యింత ఆనందంలోనూ ఏవో భావాలకందని అలజడి. డాక్టర్ సూర్యం ఎందుకో లోపలికి హడావుడిగా వెళుతున్నాడు. 


         మహా వాగ్గేయకారుని స్వరంలో అపశృతిలా రెండో అమ్మాయి వచ్చి "నాన్నా ఒక్క సారి లోపలికి రా అమ్మకి...మళ్ళీ... " అంటూ నెమ్మదిగా చెప్పింది. గుండెను చీల్చిందా కబురు. మనసు ఆతృతతో అలజడితో పరుగులు తీస్తోంది,మనిషిని మాత్రం నడిచి వెళ్ళాను. జీవన ధాత్రిని ఒడిలోకి తీసుకున్నాను. 


         నలభై ఏళ్ళుగా నా బతుకులో బతుకైన బంగారు తల్లి...నాకు యిక వుండబోదని చెప్పి ధైర్యంగా వుండమన్నాడు డాక్టరు. ఒక్క క్షణంలోనే ప్రపంచంలోని ఏకాకితనమంతా నా దరిచేరింది. ఇంత స్థబ్దంగా ఏ వేళా నా మనసు రోదించలేదు. కానీ కానీ ఆమె నా నుండి దూరమవుతుందంటే , ఇక ఏ నాడూ అందుకోలేని తీరాలకు చేరబోతోందంటే ఏదీ ఇంకా ఈ గుండె బద్దలవదేం ? ఈ చిన్ని గుండె నిండా నిండినది ఆమే అనేమో నా గుండె కింత ప్రాణ భీతి. 
 ఎలా చెప్పను కనులు మూసి కలలు కనే వయసులో నా కనులు తెరిచి తానే కలయై వచ్చి ప్రేమంటే ఏమిటో చెప్పి... ఆప్యాయతతో అమ్మగా, అనురాగంతో చెల్లిగా, అభిమానంతో స్నేహితగా, ప్రేయసిగా భార్యగా సహనంతో సౌహార్ద్రంతో జీవనవాహినిలో అంతర్వాహినిగా సాగి బతుకు బాటను నందనం చేసింది. 

        
తలపులో వలపులో ప్రతిక్షణం అమృతమయం తన జ్ఞాపకాల మధువు.లోచనాల్లో ఆలోచనల్లో ఎదలోతుల్లో అంతటా నిండినది ఆమే. 

        
నేను నీవు ఇన్ని లేవు కన్నా వున్నదొకటే నేనే నీవు. అధ్వైతమే ప్రేమంటే అంటూ చిరునవ్వి, బ్రతుకు తియ్యందనాలు నాకందించి ఇంతలోనే దూరమవుతుందంటే ... ఈ చిన్ని గుండె తట్టుకోలేదని ఎలా చెప్పను? ఎవరామె అంటే ఏం చెప్పను ? ఆ అంతర్వాహిని నా జీవన జీవని. 


**                **                **


అంతర్వాహిని 

        
తొలి వేకువ తెలి వెలుగు రేకల చిరు వేడిమికే ఓ హేమంత ప్రభాతాన కరిగే హిమ సుమాలైన కలల కలవరింతలు జ్ఞాపకాలై ... చేమంతుల తోటలలో వెర్రిగా విరాగినై ఒక్కణ్ణీ అయి తిరుగాడుతుంటే...' ఎవరావిడ ' ? కళ్ళకి కరుణ కాటుక, నుదుట వాత్సల్యం బొట్టు, ఏ తపస్చేతనకో హిమవన్నగమే కరిగి, జారి, జాలువారి, మందాకినియై కదిలి కదిలి భగీరధుని పాదాలనంటి క్ర్మేణీ పెరిగి గుండె తాకి కబుర్లాడి శిరసు ముద్దడిన ఆమెని -'ఎవరమ్మా నీవు ' 'ఎందుకింత దయ ? ' అని దీనంగా మౌనంగా అర్దిస్తే ...' నేనేరా కన్నా ! అమ్మని ' అని ఆమె చిరు నవ్వు బదులిస్తే- యుగాల వేదనా భారమంతా ఒ..క్క...క్ష...ణం లో ఆమె కంటి పాప ఒడిలో నే చంటి పాపనైన క్షణంలోనే తీరిపోయిన అనుభూతి.ఎంత తీయని స్వప్నం ! ప్రభాత నయన విభ్రమం !! 
 హేమంత శిశిరాల నడుమ కరిగిన హిమ పుష్పాన్నై అలసట ఆర్తిగా కళ్ళలో ప్రతిఫలించేందుకూ అలసి నిస్సత్తువ నరాలనీ , నిర్లిప్తత మనసునీ ఆవరించినపుడు- అల్లరిని ఆప్యాయత తో మేళవించి కబుర్ల కళారాల రేకులతో కరిగిన కలల చారికలనీ తుడిచి ... ఎవరమ్మా నీవంటే, చెవి మెలిపెట్టి 'నేనేరా స్వరాల తల్లిని, వరాల చెల్లినీ అన్న సుమ స్వప్నాల రంగవల్లి, శుభ మానసరాగాల కల్పవల్లి. 

         అపరాహ్నం , సంధ్య కెంజాయ నీడలలో కరిగిపోయాక అలసట కాసింత ఆనందంలో అలసి పోయాక, నదులు సముద్రంలో కలిసే చోట , నీరెండ రేయెండలో ఏకమయ్యేవేళ...భానుడు అనుభవుడై యామిని ఒడిలో ఒదిగిపోయాక... స్వప్నాలు మంచు పుష్పాలై విరిసేందుకు మొగ్గ తొదిగే సంధ్య చీకటి ఏటవాలు క్షణాల మీద వెలుతురై జారిపోయాక...నీలి గగనం నుదుటి మీద జాబిలి ముద్దై అవని అధర సీమలపై వెన్నెల చిరునవ్వై విరిసినా...నా...లో..ఎందుకో ఈ పగలు పగిలి పోయిన వేదన ? 


         సరీగ్గా అప్పుడే గుండె గోదారి గట్టై, ఉహు గోదారే అయి ఎక్కడో పాపకొండల నడుమ నడక నేర్చుకుని, కోనసీమ కొబ్బరాకులతో కబుర్లాడి అంతలోనే అంతర్మధనాల అంతర్వాహినిలు గుండెలోనూ గోదారిలోనూ... 


         ఎన్ని వైరుధ్యాల అడ్డుగోడలూ,ఎన్ని సహేతుక నిర్హేతుక ప్రవహ్లికలూ అవాంతరాలైనా ... పచ్చిక బయళ్ళలోనూ, యిసుక మైదానాల్లోనూ, వెన్నెల వాగుల్లోనూ,చీకటి ఛాయలలోనూ...కలిసి,కదిలి,కరిగి, ఘనీభవించి మూర్తీభవించిన మానవాకృతియై, మహనీయుని మనోకల్పిత రస రాగ కృతేఅయి; పలకరించిన పడతీ ! ' ఎవరు నువ్వు ? ' సంధ్య కాంతివా, స్వప్న కాంతవా ? అని ప్రశ్నిస్తే ... అల్లరిగా, అలవోకగా, జాలిగా జాబిలిలా నవ్వి ఒక్క కరచాలనం తో ' నేనా నీ స్నేహితనే ' అన్న సన్నిహిత. జీవన సంధ్యా స్వప్న సారికా ప్రియ గీతిక. 


         అమ్మ ఒడిలోంచి అలనల్లన జారి చెల్లెలి అల్లరి అనురాగంతో పెనవేసుకుని పెరిగిన బాల్య కౌమార్యాలూ, తొలి యవ్వనపు రోజుల ప్రియ స్నేహిత కరచాలనంతో రంగరించిన ఆత్మీయతా... మది పాత్రని జ్ఞాపకాల మధువుతో నింపుకున్న ఓ మధు మాసపు ఏకాంత రాత్రి ...డాబా మీద చంద మామ పెద్ద ముత్తయిదువై పరిచిన వెన్నెల తివాసీ పై- జ్యొత్స్నాభిసారికయైన కళ్యాణ వీణ. క్రీగంట చూసినా, కొనగోట తాకినా మౌనమో, గానమో మధురిమై పలికిన అనురాగ జాణ. 
 పాపట చెందిరము కనుపాపల కలల అర్ణవం, గులాబిరేకుల చీర కట్టు,పొగ మంచు తన మనో సౌకుమార్యం ముందు తీసి కట్టే అయినట్టు... ఆ అన్నట్టు...కరుణ ఆమె కళ్ళ కాటుక, దయ ఆమె ఆర్ద్ర హృదయ గీతిక. సౌహార్ద్రం సరే సౌమ్య సంభాషణమూ ఆమె స్వరభూషణమే అయి, నా జీవితపు వసివాడిన ఆశల విరిరేకులకీ తన కన్నీళ్ళ తో జీవం పోసి... నా గుండె పాత్రలో ఆనందం మరీ ఎక్కువై కళ్ళ వెంట ఒ..క్క...నీటి చినుకై పొరిలినా విహ్వలయై విలవిలలాడిన బేల హృదయ... బ్రతుకు చరమ గీతంలో చివరి చరణం లో కలిసి--పల్లవీ తానే అంతర్లీన సంగీతమూ తానే అయి... యింత చేసి చివరికి... ఎవరు ...ఎవరు...నువ్వన్న నా అజ్ఞానపు ప్రశ్నకి సైతం... బదులుగా..' నేనా...నేనేనా...నువ్వే, త్వమేవాహం , నీలోనేగా నా అస్తిత్వం " అని బదులిచ్చి వేకువ వేడిమికే కరిగిన కలల కౌముదికి కంటి వెంట జారిన ఆఖరి కన్నీటి చుక్క వీడ్కోలు పలికినట్ట్లు,శిశిరం కొసలో రాలే శిధిల పత్రాన్ని ఆమని వస్తూ వస్తూ ఓ సారి ఆర్తిగా పరామృశించినట్ట్లూ అల్లరి గాలి అల వేణువు గుండెలో జారి నాదమై...అంతలోనే వేణువునొదిలి తిరిగి గాలిలోనే కరిగి విశ్వవ్యాప్తమయినట్ట్లు... 

        
కనుమూసి తరచులోనే జీవన స్వప్న ప్రాంగణంలో కలిసి అంతలోనే....కరిగి పోయి...కనుమరుగయిపోయి... 


**                **                **


        
నాన్నా...నాన్నా...అని పిలుస్తోందా అమ్మాయి. 

        
అక్కడున్న డాక్టరుకి అప్పటికి అర్దమయింది తన స్నేహితుడు స్వర్గద్వారం వైపు నెచ్చెలితో చెట్టాపట్టాలేసుకుని నడక సాగిస్తున్నారని...జీవితమంతా నడిచినా తనివితీరని అసలు ఆగని నడక. మరెన్ని జన్మల తీరాలకో సాగిపోయే నడక. 

        
ప్రేమైక జీవుల అద్వైత యాత్ర... 

         (...
ఆ పెళ్ళి జరిగిందా వాయిదా పడిందా...ఆగిపోయిందా...లాంటి సామాజిక అసందర్భ ప్రశ్నలకి ఈ రచయిత వద్ద సమాధానం లేదు.)

Tuesday, January 8, 2013

అనర్థాల అనలంలో…




      భయం అంటే నాకు చాలా భయం అందుకే ఎప్పుడూ దగ్గరికి రానివ్వలేదు .కానీ

….ఆ మధ్య హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ఓ ప్రిన్సిపాల్ నిర్వాకం  ,  ఎలమంచిలి లో ఓ ట్యుటోరియల్ సెంటర్ నిర్వాహకుడి అఘాయిత్యం  ( అవి ఏమిటో వివరించి నా కీ బోర్డ్ కి అశ్లీలపు రాతల అపవిత్రతని అంటగట్ట లేను నేను )

యింక కలల కొత్త లోకాలని ఆవిష్కరించే కళాశాలలు , విశ్వవిద్యాలయాలు , ఉద్యోగ ప్రదేశాల లో మాత్రం మేమేం తక్కువ తిన్నాం అంటూ ప్రేమ పేరిట ఎమోషనల్ బెదిరింపులూ , ఆత్మ హత్యలూ ,ఏసిడ్ దాడులూ ,…హత్యాయత్నాలూహత్యలూ

సంసారాల సాగరాల అలల కల్లోలాలలో ఒక్క మునక వేసామనుకోండి ….పూటు గా తాగొచ్చి , వరం డాలో నిద్ర పోతున్న కట్టుకున్నావిడని లేపి లోనికి రమ్మని ఆఖరి అనుభవాన్ని అనుమానం తో జీవితపు ఆఖరి క్షణాలనీ అందించ గలిగిన , అడ్డొచ్చిన ఆవిడ తరపు బంధువులని సైతం అక్కడికి అక్కడే నరికి వేయగలిగిన ఉత్తమోత్తముడయిన భర్త , అన్నం లో కి కూర వండి పెట్ట లేదని తల్లిని కడ తేర్చిన పుత్ర రత్నం , తనకు భారంగా మారిందని.. కన్నతల్లిని కర్కశం గా బతికుండగానే సజీవదహనం చేసి శవాన్ని సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేసిన మాననీయ మహిళా మాణిక్యం , అయిదవ తరగతి చదువుతున్న చిన్న కూతురిని …..( జుగుప్స తో వేళ్ళు వణుకుతున్నాయి ఈ సంఘటన వ్రాయడానికి )…. న కామం తో కళ్ళు మూసుకు పోయిన ఒక దౌర్భాగ్యపు తండ్రి … ”   కథ కంచికి వెళ్ళి పోయిందనుకున్నాను కానీ పునరపి జననం

గత  కొన్ని మాసాలుగా  ప్రముఖ పత్రికల ప్రదాన సంచికలోనూ జిల్లా సంచికలలోనూ కనిపించిన వార్తలలో మాన భంగానికి గురి అయిన ఆడవాళ్ళ వయసులు నాలుగు , అయిదు,ఏడు , పన్నెండు , పద్నాలుగు , పదిహేడు , పందొమ్మిది , యిరవై ఒకటి , యిరవై మూడు , ముప్పయి రెండు , నలభై అయిదు , ఏభయి ఆరు , డబ్బై రెండు సంవత్సరాలు ..కడుపు మండి పోతోందిగుండె తరుక్కు పొతోంది యింక ఈ ఘోరాలకి పాల్పడిన లంఝడికొడుకుల ( భాషా శాస్త్ర వేత్తలు మన్నించండి ఒంటి మీద పూర్తి స్పృహలోనే ఈ పదం వాడేను ) వయసులు కనిష్టంగా పద్నాలుగు గరిష్టంగా డెబ్బై రెండుసంవత్సరాలు చక్కగా చదువుకోవాల్సిన  వయసొకరిది, హాయిగా కృష్ణా రామా అనుకుంటూ మనవలని దగ్గర కూర్చోబెట్టుకుని విద్యాబుద్దులు  నేర్పాల్సిన   వయసొకరిది ఈ మద్యలో నవ యువకుళ్ళూ , నడిమి వయసు వాళ్ళూ వారి వారి బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించవలసిన వాళ్ళు కానీ జరుగుతున్నదేమిటి ? ఆడదయితే చాలు బాల ,బేల ,ముగ్ధ ,ప్రౌఢ , వృద్ద అనే బేధం లేకుండా ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కళ్ళలో శిశ్నాలు దాచుకుని ప్రలోభపెట్టి , భయపెట్టిబెదిరించి , చావగొట్టి రాక్షసరతిలో పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఈ పాశవికులు ఏ జాతి నాగరికతకి ప్రతీకలు ? పాలు తాగుతూ కన్నతల్లి స్తనాలని కూడా కామంతో కొరికి వుంటారా వీళ్ళు  ?        సీతని ఎత్తుకు వెళ్ళిన రావణాసురుడు కూడా ఎప్పటికయినా సమ్మతించకపోతుందా అని ఎదురు చూసాడే తప్ప అత్యాచారానికి ప్రయత్నించలేదు అంతకన్నా దుర్మార్గులు కాదా వీళ్ళు ? స్త్రీ శరీరంలో సొంపైన వంపులు సృష్టించిన భగవంతుడు కొందరి పురుషుల బుద్ధిలో చాలా నికృష్టమైన నీచమైన వంకరలని సృష్టించినట్లున్నాడు . లేకపోతే నాలుగేళ్ళ పసికందుని కూడా  బెదిరించి  కౄరంగా కుతి తీర్చుకున్నది కొందరయితే  యిరవైమూడేళ్ళ అమ్మయిని దేశ రాజధాని నడివీధులలో నడిచే బస్సులో నిస్సిగ్గుగా నిర్భీతిగా బట్టలనీ వంటినీ బ్లేడుతో కోసి …. చితక బాది చిత్రవధ చేసి సామూహికంగా అనుభవించిన త్రాష్టులు కొందరు ఈ ఎపిసోడ్ మొత్తానికి ప్రధాన పాత్రధారీ సూత్రధారీ ఖర్మ కాలి ఒక మైనర్ , రాక్షసంగా కుతి తీర్చుకోవడానికీ నికృష్టమైన నేరాలు చేయడానికీ వయసొచ్చింది కానీ ఈ త్రాష్టుడిని శిక్షించడానికి న్యాయస్థానాలకి వీడొక బాలుడయిపోయాడు దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల వల్లనో మరే కారణాల వల్లనో వీళ్ళందరినీ న్యాయస్థానాలు  కొత్త చట్టాలనీ సృష్టించింది  కొత్త శిక్షలని సృష్టించి మరీ శిక్షిస్తుందనే ఆశిద్దాం కానీ భార్య కాని స్త్రీతో శృంగారించాలనే ఆలోచనే తప్పన్న భావన శ్రీరాముడు పుట్టిన ఈ దేశంలో ఏ జీవినీ హింసించకూడదన్న మహావీరుడూ బుద్దుడూ నడిచిన ఈ గడ్డమీద  ఎంతమంది మగాళ్ళకి వుంది ? మృగాలు కూడా కామాన్ని యింత కర్కశంగా తీర్చుకోవు , మరీ మగాళ్ళకేం పోయేకాలం ? మలకూప ద్వారంలోనో , మకరద్వజుని కొంపలోనో అవతలి వ్యక్తి సమ్మతి లేకుండా అంగాన్ని పాక్షికంగానో , సంపూర్ణంగానో జొప్పించి ( దీనినే రేప్ గా అభివర్ణించిందనుకుంటా చట్టం ..) బలవంతంగా అనుభవించడం కేవలం కామాన్ని తీర్చుకోవడానికా అధిపత్యాన్ని చెలాయించడంలొ పొందే పైశాచిక ఆనందాన్ని అనుభవించడానికా ? దేనికైనా ప్రాణాలనీ అంతకన్నా ఎక్కువగా భావించే మానాలనీ కోల్పోతున్నది మాత్రం స్త్రీలే ఈ  వికృత క్ర్రీడల వార్తా విశేషాల దన్ను చూసుకుని భయానికి నేనంటే బొత్తిగా భయం పోయింది , ఈ మద్య నిరంతరం నన్నంటిపెట్టుకునే వుంటోంది .

             శృంగార అంగం తొడల మధ్య కాక చెవుల మధ్య వుందంటాడు ఓ ప్రసిద్ధ ఆంగ్ల నాటక రచయిత  నిజమే పట్టుమని పది పన్నెండేళ్ళయినా లేని పిల్లలు తోటి విద్యార్థినిలవైపు , కొండొకచో లేడీ టీచర్లవైపు చాలా ఆబగా చూస్తూ పాఠాలు వినకుండా ఏవో లోకాలలో విహరిస్తున్నారు . వీళ్ళ ఆలోచనలు యింత పెడత్రోవ పట్టడానికి కారణమేమిటి ? బ్రెయిన్ హార్డ్వేర్ అయితే మైండ్ సాఫ్ట్ వేర్  అట దానికి అధర్మ  శృంగార  వైరస్ అంటకుండా కాపాడుకోవల్సిన సామాజిక బాధ్యత సమిష్టి గా అందరిదీ కాదా ? పిల్లలు అర్థరాత్రి దాటే వరకూ పుస్తకాలు పట్టుకుని ఆ పైన ఎవరూ చూడకుండా తలుపులేసుకుని ఏ చానల్స్ చూస్తున్నారో , ఏం బ్రౌస్ చేస్తున్నారో ఓ కంట కనిపెట్ట గలిగిన తల్లిదండ్రులు ఎంత మంది ? పిల్లల కెరీర్ మీద వున్న శ్రద్ద వాళ్ళ కేరక్టర్ పట్ల ఎందుకు కనబరచటం లేదు తల్లిదండ్రులూ విద్యాసంస్థలూను ? ఎందుకంటే కెరీర్ పెట్టుబడికి తగిన లాభాల్ని తెచ్చిపెడుతుంది .కేరెక్టర్ ఎలా వుంటే ఎవడిక్కావాలి శతకోటి లింగాల్లో బోడిలింగంయిదీ చాలా మంది ఆలోచనా సరళి . ఎంత బిజీ జీవితమైనా పిల్లలతో గడపడానికి తల్లిదండ్రులూ భర్తతో గడపడానికి భార్యా (వైస్ వెర్సా ) కొంత సమయాన్ని కేటాయించకపోతే ఆ సమయం ఎవరో పరాయి వాళ్ళు కేటాయిస్తారు అది చాలా సందర్భాలలో ఆపోజిట్ సెక్స్ కి చెందిన వాళ్ళే అవుతారు తర్వాత అనర్థాల అనలంలో సర్వం కాలాక ఆకులు వెదుక్కిని ప్రయోజనం లేదు . కొంచం ఆలోచిద్దాం ….మారదాం మార్చుదాం !!!