Wednesday, May 8, 2013

నిర్వాణాష్టకమ్

నేను మనసుని కాను, మేధనీ కాను,అహాన్నీ,మనోజ్ఞానాన్నీ కాను; 
నేను దేహాన్నీ, దేహ పరివర్తనలనీ కాను; 
నేను దృశ్య శ్రవణ జిహ్వ ఘ్రాణేంద్రియాలనూ కాను, 
పృధ్వి,వాయు,ఆకాశ,తేజాలను నేను కానే కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను (శివోహం,శివోహం). 

నేను ప్రాణాన్ని కాను,పంచ ప్రాణ వాయువులనీ కాను; 
పంచేంద్రియ పేటికా పదార్దాలనీ కాను,పంచ కోశాలనీ కాను నేను; 
నేను కర్మేంద్రియాలనీ కాను, ఇంద్రియ జ్ఞానాన్నీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని,నేనే అతను (శివోహం,శివోహం). 

నేను అసహ్యాన్నీ అనుబంధాన్నీ ఎరుగను,ఆశనీ,మాయనీ కాను; 
అహంకారిని కాను,వైషమ్యాన్నెరుగను,ధర్మాన్ని కాను,మోక్షాన్నీ కాను; 
నేను కాంక్షని కాను,కాంక్షగొలిపే విషయాన్నీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

నేను పాపాన్నీ పుణ్యాన్నీ కాను,ఆనందాన్నీ అశ్రువునీ కాను; 
ఆలయాన్నీ కాను,అర్చననీ కాను,పుణ్యక్షేత్రాన్నీ,పవిత్రలిఖితాన్నీ కాను, 
ఆనందపు చర్యనీ,ఆనందింపదగిన వాడినీ,ఆనందించే వాడినీ కాను; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

మృతి లేదు నాకు మరణ భీతి లేదు, కుల మతాలు లేవు, జాతి లేనేలేదు; 
నేనసలు ఏనాడు జన్మించనే లేదు,తల్లిదండ్రులు లేరు,బంధు మిత్రులులేరు; 
గురువు, శిష్యుడు నాకు లేనె లేరు; 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణ ఆనందాన్ని- 
నేను అతడిని, నేనే అతను(శివోహం,శివోహం). 

జ్ఞానాలచే నేను స్పర్శించబడలేదు,నేను ముక్తినీ జ్ఞానినీ కాను; 
ఆకృతీ,అవధీ,లేక కాలాంతరాళాల ఆవలి గట్టున నేను; 
సమస్తంలోనూ,సర్వంలోనూ విశ్వమూలాలలోనూ నేనే. 
నేను పరిపూర్ణ అస్థిత్వాన్ని,పరిపూర్ణ జ్ఞానాన్ని,పరిపూర్ణానందాన్ని- 
నేను అతడిని,నేనే అతను (శివోహం,శివోహం). 

The complete works of swami vivekanada vol-4 pp 391,392 నుండి స్వేచ్ఛానువాదం