Tuesday, June 29, 2010

లలితగీతం ...

పల్లవి :
రవంత శృతి కోరెనోయి
రవళింప రాగాలు వేయి
వెర్రి వేణువు గుండె కెన్నాళ్ళు మౌనాలు
మోయలేదిక తాను మౌనాల భారాలు
చరణం :
యమునా తరగల గలగల శృతిలో
యవ్వన గోపిక కల గమకములో
సైకత సీమల వేదికపైనా
ధన్యధేనువులె శ్రోతలు అయిన-
మురళీ లోలుని మోవి తాకిన... రవంత
చరణం :
యమునా ధుని ధ్వని
బృందావన వని
సుమ శర బాధిత రాధ పద ధ్వని
హృదయ కర్ణికలనావృతమైనా
మురళీ లోలుని మోవి తాకిన... రవంత

గానం , సంగీతం : prof.bvbabu

Friday, June 25, 2010

మనిషి

మనిషి సమస్త తప్పిదాలనీ
భరించ లేకపోతే -
ఎన్నటికీ ప్రేమించకు .
చూసిన చిన్న కారణాలకైనా
అప్పుడప్పుడు అసూయ పడే మనిషి
చికాకుగా తల విదిలించి
తక్షణమే పశ్చాత్తాపంతో -
మాట్లాడే మనిషి .
పూజ్య సహృదయులు మాత్రమే
ఎందరిపైనో ప్రేమ చూపగలరు .
ఏ ఒక్కరిలోనో అమరి -
ఆకృతి దాల్చినా సరే
ఏ ఒక్కరిలోనూ అలక్ష్యం కాని -
అందం
సహృదయాలకి సైతం-
నయన విభ్రమం కలిగిస్తే
వివాహ ఉపసర్పణ
ప్రచ్చన్న వేషం కాక మరేమిటి ?
వలసినప్పుడు వ్యవహారాలలోనూ
అలసినప్పుడు విశ్రాంతిలోనూ
ఒక్కోసారి వేటలోనూ ,
మరోసారి ఓటమి లోనూ ,
రికామీగా తిరుగుతో -
ఎప్పుడూ కూర్చుని కబుర్లాడని మనిషి
యివన్నీ , యిలాంటివన్నీ -
ఏ మనిషిలోనైనా -
భరించగలిగితేనే,
ఆ మనిషిని యిష్టపడు,
ప్రేమించు,
ఎన్నటికీ భయపడకు...

Thursday, June 24, 2010

ప్రేమైకం

నిన్ను వలచిన పథాలని
ఏ పదాలలో వర్ణించను ?
నా ఆత్మ చరించగల
విశ్వంతరాళాల పరిథి లో
నిన్ను ప్రేమించాను .
అనుభూతీ , అస్థిత్వం ,
ఆదర్శ సౌందర్యం ...
అంతమైనప్పుడూ-
ప్రతినిత్యం భానూదయం నుండీ
చంద్రాస్తమయం దాకా నిన్ను ప్రేమించాను .
మనిషి హక్కుగా పోరే స్వేచ్చ తో
నా ప్రేమ లో బంధీ నైనాను ,
ప్రార్ధనానంతర ప్రశాంత పవిత్రతతో
నిన్ను ప్రేమించాను .
శోక తప్త గతం లోనూ ,
బాల్య విశ్వాసాలతోనూ ,
మృతించిన సహృదయాల నడుమ
ప్రేమ రిక్త మవుతున్నపుడూ,
నిన్ను ప్రేమించాను.
నా సమస్త జీవిత శ్వాసలోనూ
చిరునవ్వుల ఆశలోనూ,
కలలలోనూ , కన్నీళ్ళలోనూ ,
నిన్ను ప్రేమించాను .
సర్వాంతర్యామి వరమిస్తే
శవాన్నయిపోయినా ,
ప్రేమకి వశమై పరవశమై
సమధి పైనా పరిమళిస్తాను ,
నిన్నింకా ప్రేమిస్తో ...

నిశ్శబ్ద నయనాశ్రువులు ...

అర్దశకల హృదయాలు
అనంతంగా శిధిలమై
మౌనాశ్రువులు కురుస్తాయి
మన వియోగ క్షణాన .
పాలిన చల్లారిన చెక్కిళ్ళు ,
స్పందన లేని ముద్దూ
ముందే తెలిపాయి -
ఈ విషాద ఘడియల్ని .
నొసట చల్లగా యింకిన
ప్రత్య్యూష తుషారాల హెచ్చరిక
` ఆవిరై పోతావన్న నేటి
నా భావానికి ప్రతీక .
బాసలెన్ని భగ్నమైనా
కీర్తి కాంతిలో నీవు ,
నీ ఖ్యాతి స్త్రోత్రాల వెన్నంటిన
అవమానాలు వింటూ నేను .
వాళ్ళు - నిన్ను బాగా తెల్సిన వాళ్ళు
నీవు నాకు తెలుసనీ తెలియని వాళ్ళు
నా ఎదుట చెప్పే నీ ఊసులు
నా వీనుల హంస ధ్వని రాగాలు ,
నిలువెల్లా మృత్యు భీకర కంపనాలు .
ప్రియతమా ! ఎందుకిలా
చాలా కాలంగా చెప్పలేనంత
గాడంగా బాధించేనా నిన్ను ?
రహస్య నిశీధాలలో కలిసాం మనం
నీ హృదయం నన్ను మరుస్తుందనీ
నీ ఆత్మ నన్ను వంఛిస్తుందనీ
ఏకాంత నిశ్శబ్దాల లో నా రోదన .
సుదీర్ఘ కాల వ్యవధిలో -
మళ్ళీ కలిస్తే -
ఎలా పరామృశించను నిన్ను ?
నిశ్శబ్ధ నయనాశ్రువులతో తప్ప ...


కాంక్ష

నిరాశా భరిత సుదీర్ఘ దినాలకన్నా
నీవు కాలు మోపే కలల రాత్రులే మిన్న .
నా కలల వాకిళ్ళ నీ పాదాలు మోపు చాలు
ప్రత్యూషా నికల్లా నవ జీవనం తో
పరిమళిస్తాను నేను .
ప్రకాశ దేశాల ప్రదూతలా
వేల రాకల వాకల శాఖలా రా !
నా కలల నీ క్రొత్త లోకాన నీ నవ్వు
నా పైన మల్లేనే జగమంతా దయ రువ్వు .
నుదుట ముద్దాడి ముంగురులు సవరించి
` సఖుడా ! ఎందుకింత వ్యధ ' అని పలకరించే
నీ స్వరం స్వప్నాన సత్య మగుటే వరం
యిల లోన నీ రాక కాక పోతేనేం నిజం ...

నిన్ను ప్రేమించ కుండా ...

నిన్ను ప్రేమించకుండా ఒక్క దినమైనా

నీ ఆలింగన వియోగాన ఒక్క రేయైనా

జీవించ లేదు నేను.

నా జీవన చలనోల్లాసాన్ని నా నుంచి వేరుగా వుంచే

తేనీటి గుక్క పాటు కాలం -కాంక్ష నీ , గర్వాన్నీ

తిట్టుకోని క్షణం లేదు .

` భావి లో నీవు నన్నింక ప్రేమించవు ' అని

నా వెర్రి యోచనలకి ప్రగాఢ భీతి .

నా పై ప్రేమ తగ్గిందని నీవు తెలిపిన రోజు

నా ప్రేమకీ , జీవితానికీ అదే చరమ దినం .

తిరిగి పొందలేని ప్రేమకి

నా హృదయం పేటిక అయినప్పుడు

దానిని శకలాలుగా చిద్రం చేస్తాను ...



Wednesday, June 23, 2010

నీవు

ప్రాస ప్రాణమై పల్లవించే -

పదాలని పలికించే స్వరం

నావరమైనదీ ,

మనసులోనూ మేధలోనూ

కవిత్వం అంతర్లీనమైనదీ

నీ ప్రేమతోనే కాబోలు .

అవును నీవే కవితవి ?

ప్రబంధ బందానివా

నాపై దయ వర్షించు .

చందో చర్చిత ద్యానివా ?

కాదు అది మరీ ష్టమూ ,కృతకమూను

నీవో
మధుర లావణ్య

ఉల్లాస శోకతప్త గీతానివి .

పల్లె పాటవి .

అప్పుడప్పుడు కన్నీళ్ళతో ,

ఒక్కోసారి చిరునవ్వులతో

మరోసారి

ఆనందాశ్రు మిళితానుభూతి తో

ప్రకృతి పాడే పాటవి ...






ప్రధమ కాంక్ష ...

ఈ సమస్త విశ్వం లో నీవు తప్ప ,
నీ విలువయిన ప్రేమ తప్ప
నేనేమీ కోరను .
ఈ ప్రాపంచిక పదార్ధాలన్నీ
నాకు వ్యర్ధమైనవే ,
నీ హృదయం నా స్వంతమవడానికి
ఏమైనా, ఏమైనా చేస్తాను నేను.
నాకు జీవితం పట్ల కూడా -
కోరిక లేదు .
ప్రేమ నా ప్రధమ కాంక్ష ,
జీవితం యాదృచ్చికం మాత్రమే.
నేను నీకోసమే జన్మనెత్తానని-
నీవనుకోవూ !
నీ కోరిక మేరకు మాత్రమే
నేనీ భూమిపైకి తేబడిన వాడినని -
నా అనుభూతి .