Monday, June 6, 2011

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట ...

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట ...
సత్యలోకం లో ఓ అందమైన సాయంత్రం కచ్చపి తీవెలలో స్వరసుమాలు విరుస్తున్నాయి. బ్రహ్మదేవుడు తన్మయుడై ఆ రాగ పరిమళాలను ఆస్వాదిస్తున్నాడు. యింతలో మహతిని మీటుకుంటూ నారదుడు ప్రవేశించాడు , వెన్నంటే తుంబురుడూను , వీరిని చూడగానే బ్రహ్మదేముడికి భూలోకం గుర్తొచ్చింది . శూన్యం నుండి ధ్వని ప్రసరించదనీ స్పురణకొచ్చింది . తన భార్య సరస్వతికి ఎంతో ప్రియమైన ఆ వీణారావాలు భూలోక వాసులని చేరవని కొద్దిగా దిగులు చెందాడు . పాపం చతుర్ముఖుడు కదా అంతర్ముఖుడు కాలేకపోయాడు . సరస్వతీ వాహనమైన హంస ఆ దిగులు గమనించింది , తీర్చాలనుకుంది . అటూ యిటూ చూసి పుటుక్కున కచ్చపి నుండి ఓ తీవెని లాగి ముక్కున కరుచుకుని ... వైకుంఠం వైపు ఎగిరింది అలాగే పాలకడలిలో ములిగింది . లక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ఆశ్రీర్వాదాన్ని పొందింది . రెక్కలు కట్టుకుని... కైలాసానికి ఎగిరింది పార్వతి ఆశీర్వదించింది, గంగ అభిషేకించింది, శివుడు సరే సరి... తిరిగి సత్యలోకానికి చేరింది . ఆ తీవె తునకని భక్తిగా బ్రహ్మదేవుడి పాదాల ముందుంచింది . బ్రహ్మకేదో సంకేతమందింది . నవ్వుతూ మానస పుత్రుడైన నారదుడి వైపు చూసాడు . నారదుడు మహతి లోని ఓ తీవెని తీసి ఆప్యాయంగా బ్రహ్మకిచ్చాడు, అలాగే తుంబురుడూను ... ఈ మూడు తీవెలను కలిపి తను సృష్టించే కొంతమంది స్వరపేటికలలో అమర్చాడు బ్రహ్మ ...

....యిది జరిగి సుమారు 164 సంవత్సరాలైంది . త్యాగరాయ స్వామి అవతరించాడు సుమారుగా అప్పుడే శ్యామాశాస్త్రీను ...కాల క్రమేణా ...1946 జూన్ నాలుగున నెల్లూరు జిల్లాలో కోనేరమ్మపేట గ్రామం లో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శ్రీమతి శకుంతల దంపతులకి శ్రీ బాల సుబ్రహ్మణ్యం జన్మించారు .

శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారికి ఇద్దరు సోదరులు అయిదుగురు సోదరిలు . మొత్తం ఎనిమిది మంది సంతానంలో ఈయన రెండవవారు . ఈయన తండ్రిగారు అప్పట్లో పేరెన్నికగన్న హరికథాపండితుడు . సంగీత సాహిత్య విశ్వరూపం హరికథ .వేదికపై పాత్రధారి ఒక్కడే పాత్రలనేకం , గాత్రధారీ ఒక్కడే ... వేదికపై `` శ్రీకృష్ణుడై పాంచజన్యం పూరించాలి , అర్జునుడై గాండీవం సంధించాలి , రథమై , గజమై , ఘీంకారమై , ఓంకారమై , నృత్యమై , గానమై .." సర్వం, సకలం తానే అయి కథ రక్తి కట్టించాలి . అలా తన తండ్రిగారు చెప్పే హరికథలలో బాల్యం నుంచీ లీనమై గాత్ర శుద్ది నే కాక పాత్ర ఔచిత్యాన్ని సరిగ్గా పట్టుకోగల హృదయ ఔన్నత్యాన్నీ పెంచుకున్నారు శ్రీ బాలు . సమాంతరంగా చదువు . తండ్రిగారి కోరిక మేరకు మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ ., లో చేరారు . 1964 లో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు లలిత సంగీత పోటీలు నిర్వహించారు . బాలు పాల్గొన్నారు . శ్రీ ఘంటసాల గారు , శ్రీ పెండ్యాల గారు , శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు , న్యాయ నిర్ణేతలు . మొదటి బహుమతి శ్రీ బాలుగారికే . రవంత లేతగా వున్న శ్రీ బాలు గారి గాత్రం కాస్త ముదిరితే సీమాలలో అవకాసం యిస్తానన్నారు శ్రీ ఎస్.పి.కోదండపాణి గారు ఆ పోటీలో బాలుగారి పాట విని, పాడే పద్దతి నచ్చి . ...పాట మరింత ప్రాణమయింది. సార్థకమయే సాధనలో మెరీనా గాలులు మరింత పరిమళాన్ని పెంచుకున్నాయి .

దాదాపు రెండేళ్ళు నిరీక్షణ , నిరంతర సాధన . 1966 డిసెంబర్ లో శ్రీ కోదండపాణి గారు కబురు పంపారు . ఏదయినా ఓ పాట పాడమన్నారు . తనే వ్రాసి స్వరపరిచిన ` రాగమూ అనురాగము ' అనే పాటని పాడారు బాలు . మరొకటి పాడమన్నారు . తనదైన శైలిలో పాడారు బాలు పాత్రలో గాత్రాన్ని మమైకం చేయగలగడం తండ్రి గారి హరికథల వలన అబ్బిన విద్య మరి . ఆ పాడే పద్దతి నచ్చింది కోదండపాణి గారికి . శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ చిత్రంలో వీటూరి గారు వ్రాసిన ఏమి వింత మోహం ... బాలు గారి తొలి సినిమా పాటగా పల్లవించింది . అదీ ఆరంభం ...క్రమేణీ పాడిన ప్రతీ పాటలోనూ సంగీతానికి, సాహిత్యానికీ , సన్నివేశానికీ న్యాయం చేకూరుస్తూ , సన్నివేశబలానికి తగిన నటనని గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటిస్తూ వీటూరి , ఆరుద్ర , శ్రీశ్రీ , కృష్ణశాస్త్రి, ఆత్రేయ , వేటూరి సీతారామశాస్త్రి , వైరముత్తు వంటి మంచి సినీకవుల హృదయ స్పందనలను తన గుండెలో దాచుకుని గొంతులో పలికిస్తూ సుమారు నలభైవేల పాటలను , తెలుగు , తమిళ , కన్నడ , మళయాళ , హిందీ , తులు , ఒరియా , అస్సామీ , బడగ , సంస్కృత , కొంకిణి , బెంగాలి , మరాఠీ ,పంజాబీ , ఇంగ్లీష్ వంటి 11 భాషలలో పాడారు . నలభై సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు .

1981 ఫిబ్రవరి ఎనిమిదిన ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు 17 పాటలు పాడి రికార్డ్ సృష్టించిన శ్రీ బాలు తరువాత ఒకే రోజులో 19 తమిళ పాటలు రికార్డ్ చేసారు . హిందీలో ఒకే రోజున 16 పాటలు పాడి ఘనత వహించారు .

యిది గాయకుడిగా ఎస్.పి.బాలు విశ్వరూపం .
వివిధ పాత్రలలో నలభై అయిదు సినిమాలలోనూ చానల్స్ లోనూ పాత్రోచితంగా నటించారు.
ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి 29 సార్లు నంది అవార్డులని, కలైమామణి , విశ్వగానయోగి , విశ్వగానయోగి , నాదనిధి , గానగంధర్వ వంటి బిరుదులనీ పొందారు. 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ , 2009 లో సత్యభామ యూనివర్సిటీ వీరిని డాక్టరేట్ తో గౌరవించాయి .

భారత ప్రభుత్వం 2001 లో ఈయనకి పద్మశీ యిచ్చి గౌరవించింది . 2011 లో పద్మభూషణ్ యిచ్చి ఆ గౌరవాన్ని మరింత పెంచింది . ప్రతిభాపాటవాలని మించిన మంచితనం మానవీయత , మృదుస్వభావం , ఔదార్యం, బొండుమల్లెలవంటి నిండైన నవ్వు , ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన మనిషితనం ...శ్రీ బాలు గారి స్వంతం .

వీరి శ్రీమతి సావిత్రి గారు , కుమారుడు చరణ్ , కుమార్తె పల్లవి .

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట . నిండయిన తెలుగుతనాన్ని వర్ణించే వాక్యంలో మొదటి మూడు పదాలూ కృష్ణశాస్త్రి కవిత , బాపూ బొమ్మ , బాలూ పాట...
ఈ పద్మభూషణుడి కోసం ....భారతరత్న ఎదురు చూస్తోంది .
సర్వేజనా సుజనోభవంతు
సర్వేసుజనా సుఖినోభవంతు
శుభం జయం సదా సర్వదా ......
గాన గంధర్వుడికి జన్మదిన శుభాకాంక్షలు...

---ఆచాళ్ళ శ్రీనివాసరావు