Monday, December 17, 2012

విస్పోటనాల ద్రుతి లో విల విలలాడినా 
వేడి సెగల ఉద్రుతిలో సలసల కాగినా 
ధరిత్రి గతినే నిలిపిన బంధం విధాత వరము కదా 
అది మనిషి కి ప్రేమ కదా .............

Friday, October 26, 2012

బలి అవుతున్నది బాల్యమా ?





అమ్మ కొంగు చేజుట్టుకుని
నాన్న వేలికొన పట్టుకుని
పయ్నించే ఆ పసిడి పసితనం
ఎంతమంది సొంతం ? అయ్యో విధికి ఎంత పంతం ?

వెన్నెల చలికే వణికే చేతులు
వేడి చాయ్ లందిస్తుంటే
పలకా బలపం పట్టే ప్రాయం
పనిలో యాతన పడుతుంటే
బలి అవుతున్నది బాల్యమా ?
దేశ ప్రగతి భవితవ్యమా ?

మట్టి ఒడిలోన మమత పంచుకొను
గుజ్జనగూళ్ళను కట్టుకుని
మబ్బుతునకపై మమత పెంచుకుని
గాలిపడగలెగరేసుకుని
మన్నునుండి ఆ మిన్ను వరకు
ఈ విశ్వమంత మాదే అనే
అందమైన ఆనందమైన అపురూపమైన బాల్యం
ఎంతమమంది స్వంతం అయ్యో విధికి ఎంత పంతం ?

Monday, July 23, 2012

మన ప్రాణమైన దేశం...


పల్లవి : 
దేశం ! 
మన ప్రాణమైన దేశం జన ప్రణవమైన దేశం  || 2 సార్లు || 
చరణం : 
వేద స్మృతులకు జన్మను యిచ్చిన 
దివ్య ధాత్రి మన భారత దేశం 
వేల సిరులనీజగతికి పంచిన 
ధన్య ధాత్రి మన భారత దేశం  

మంచు నగాలే మంచితనాలై 
గగన తలాలని తాకే దేశం 
త్రిలోక రక్షక త్రిమూర్తి స్వరూప 
సాగరాల సం రక్షిత దేశం ...           ||  దేశం...  ||

చరణం :
 ధరిత్రి పథాల చరిత్ర మార్చే 
సుధర్మ పదాల శుభ సందేశం 
ఆదిశంకరుని అడుగుల సడిలో 
జగతికి పంచిన ధర్మ క్షేత్రం 

అర్థసత్వమే అస్త్ర శస్త్రమని 
చాణిక్యుడు బోధించిన దేశం 
సత్య అహింసల అక్షయ పాత్రగ 
గాంధీ పుట్టిన భూతల స్వర్గం ..         || దేశం ...|| 

చరణం : 
జనగణమన సుస్వరముల శృతిలో 
జనమనములు పాలించే దేశం 
సువర్ణ శోభిత త్రివర్ణ పతాక 
ప్రగతిశీలి మన భారత దేశం 

మానవ విలువల సమగ్ర రక్షణ 
శ్వాసించే రాజ్యాంగ రక్షితం 
దేశ సమైఖ్యత ముక్కలు చేసే 
దుష్టుల పాలిటి జ్వాలానేత్రం ...

దేశం ...
కలల సాకార దేశం మన కలాం పుట్టిన దేశం
యిది    స్వప్న సావాస దేశం సచిన్ పుట్టిన దేశం 
మన ప్రాణమైన దేశం జన ప్రణవమైన దేశం.... 
మన ప్రాణమైన దేశం జన ప్రణవమైన దేశం.... 

Thursday, June 14, 2012

అహింసా శ్రమం నట్టింట్లో...

అహింసా శ్రమం  నట్టింట్లో నెత్తుటి తివాసి పరుస్తూ
శాంతి కపోతం రెక్కలపై కత్తుల కవాతు చేయిస్తూ
నెత్తుటి దారులలో పరుగెత్తే పాదాలు
చిక్కటి చీకటిలో వెలుతురుకై పయనాలు (!)

ప్రతీ చర్యకీ (for every action ) ప్రతి  హింసే ప్రతి చర్యని (reaction) అనుకుంటూ
కన్నుకి కన్ను సిద్దాంతం అని గన్ను పట్టుకుంటూ
అం ధత్వం లో మగ్గే జాతికి వెలుతురు కిరణం దేనికని
మహాత్ముడే మరు జన్మ నెత్తి ప్రశ్నిం చడా ఆ సూర్యుడిని ...

Wednesday, June 13, 2012

ట్యూన్ కి పాట వ్రాసే సాధన లో ...


సందర్భం : గెలుపుకోసమో  గుర్తింపుకోసమో ఉనికిని నిలుపుకోవడానికో ఉన్నతిని చేరుకోవడానికో ...
కారణాలేమయినా ...కాలంతో పరుగులు తీస్తూ పెర్సనల్ లైఫ్ లో అయిన వాళ్ళని మిస్ అవుతున్న అతడు ... 
...గమ్యం చేరినా పయనం తప్పదనీ `  మరి మనకంటు మిగలాలి మనవయిన క్షణములు అనే భావనలో ఆమె . ఇదీ సంధర్భం .
 కొంచం అటూ ఇటూ గా భార్యాభర్తల  మధ్యా తల్లిదండ్రులు పిల్లల మధ్యా ఆఖరికి స్నేహితుల మధ్య సైతం ఇలాంటి సంధర్భాలు అసందర్భం కాదు .
ఒరిజినల్ సాంగ్ : క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా ... '

ఆమె  : ఆహా ఆహా ఆహా  ఆ ఆ ఆ ...
అతడు : కదిలే నదిలా యిల సాగేటి ఈ జీవితం
       కరిగే  అలలా మన ప్రేమాయె ఒక జ్ఞాపకం
       తనలో ఎన్ని అలజడులు ఎన్ని అందాలు దాచుకున్న గమనం
       తనకై కొన్ని మధనాలు కొన్ని మధురిమలు స్వంతమైన పయనం
       యిది కన్నీటి పన్నీటి సంగమ శృతి గతి ...  ||కదిలే ||
చరణం :  అతడు   ప్రతి కలా ... పరవళ్ళలొ అలలుగా పొంగనీ  
       గెలుపుకై ...అడుగడుగున పరుగులె తీయనీ  
       ఉరకలే ఊపిరై గెలుపులే మలుపులై 
       తన గమ్యాన్ని చేరేటి సాధనల శోధనలొ    ||కదిలే|
ఆమె  : ఆహా ఆహా ఆ ఆ ఆ ఆ .....
అతడు : darling !
        dreams die first
        but the eyes not yet
        little the time I have
        noway but to move
        to win allover for ever and ever ...
       
        .ఆమె : సంద్రమే ...చేరగానె ఆగదే ఏ నదీ
       ఆవిరై ...నింగి చేరి వాన కాదా అదీ
       గమ్యమే  చేరినా గమనమే ఆగునా
       మరి మనకంటు మిగలాలి మనవయిన క్షణములు 
        కదిలే నదిలా యిల సాగేటి ఈ జీవితం
అతడు:  కరిగే అలలా మన ప్రేమాయె ఒక జ్ఞాపకం
ఆమె : తనలో ఎన్ని అందాలు ఎన్ని అలజడులు దాచుకున్న హృదయం
అతడు : తనకై కొన్ని మధనాలు కొన్ని మధురిమలు స్వంతమయిన పయనం
ఇద్దరు : యిది కన్నీటి పన్నీటి సంగమ శృతి గతి ...
ఆమె  : కదిలే
అతడు : నదిలా
ఇద్దరు: యిల సాగేటి ఈ జీవితం
అహా ఆహా ఆహా ...ఆ ...

         
 శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి శ్రీ కీరవాణి గారికి క్షమాపణలు ,
కృతజ్ఞతలు
ఆశీర్వాదాభిలాషి