Thursday, August 5, 2010

పరవశాల పల్లకిలో ...

లలిత గీతం :

పల్లవి :
పరవశాల పల్లకిలో పద మల్లికలే పరిచి
ఎదురు నిలిచినాను సఖీ ! వరమీయవె ఒక సాకి
చరణం :
శ్రీనాధ కవినాధ కౌగిళ్ళలో ఒదిగి
శ్రీరంగ సూర్యుని కెంపు కన్నుల వెలిగి
శృంగార అంగార హృదయాల రగిలించి
మా భావ కవిదేవ స్వప్నాన నిదురించి
ఎంకి పాటల వొంకి వొడ్డాణములు చుట్టి
కిన్నెరసాని గా కదలి ఆడిన సఖీ ..

చరణం :

అధర ముద్రికలను అడగలేదే చెలీ
కౌగిళ్ళ లోగిళ్ళు కోరబోనే సఖీ
కలత నిద్దురనైనా నే కనుమూయులోపయినా
కాసింత కరుణించి వరమీయి ఒక సాకి
కొనగంటి చూపైన కరుణించవే చాలు
నీ చరణముల చెంత మరణమైనా మేలు ...!

స్వర కల్పన ,గానం : prof.bvbabu

2 comments:

  1. శ్రీనివాసరావుగారు,
    మీ కలం నుండి జాలువారిన అచ్చమైన ఈ తెలుగింటి రచన అధ్బుతంగా వుంది.
    మీరు రాసే ఈ పాటలను వినే అవకాశం వుందా మాకు? ప్రొఫెసర్ బాబు గారు స్వరపరిచారన్నారు ఈ పాట. ఇవి ఆకాశవాణిలోగాని, దూరదర్శన్లో కాని ప్రసారమవుతాయా తెలియజేస్తారా? ఇంత చక్కటి సాహిత్యంతో వున్న పాటలు వింటే ఇంకా ఎంత బావుంటాయో అనిపిస్తుంది. మీరు ఇంకా ఇంకా మంచి మంచి కవితలు, లలిత గీతాలు రాస్తూనే వుండాలని మనసార కోరుకుంటూ.

    ReplyDelete
  2. నమస్కారమండీ !
    రెండుపదుల వయసులో కాలవ గట్ల వెంబడీ , ఊరి చివరి మామిడి తోటల లోనో నూతి పెరటిలో నూతిగట్టుపైనో స్నేహితులంతా కూర్చుని నేను వ్రాస్తే బాబు స్వరపరచి పాడే వారు సెలవుల సాయంత్రాలలో... ఇదంతా సుమారు 20 సవత్సరాల క్రితం మాట ఇప్పటికీ ఆయన పిలానీ నుండి ఆంధ్రా వచ్చి కలసినప్పుడు పాడించుకుని ఆనందించడమే ...
    మీ అభిమానానికి ధన్య వాదాలు

    ReplyDelete