Wednesday, June 5, 2013

మొక్కే దేవతలు

 ఈ ఏప్రిల్ పదమూడవ తేదీన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మొదటి పుటలో ప్రచురించబడిన ఓ వార్త నన్ను ఓ ఉల్లాస ఉన్మత్తతకి గురిచేసింది. ఆనందం మారు రూపులో పరామర్శించింది.  రాజస్తాన్ లోని ఓ గ్రామంలో పుట్టిన ప్రతీ బాలిక పేరా నూటపదకొండు మొక్కలు నాటుతారనీ , అలా నాటిన మొక్కలు యిప్పటికి సుమారు అర్థమిలియన్ దాకా ఉన్నాయనీ.. అలాగే ఆడపిల్ల పుట్టిన వెంటనే తండ్రి దగ్గర పదివేలరూపాయలు తీసుకుని బంధువర్గం,గ్రామపంచాయితీ కలిపి మొత్తం యిరవైఅయిదువేల రూపాయలు ఆ బాలిక పేర యిరవై సంవత్సరాలకి డిపోజిట్ చేస్తారనీ అలా చేసేముందు ఆ బాలికకి చట్టపరమైన వివాహయోగ్యతా వయసు వచ్చేవరకూ ఎటువంటి పరిస్థితులలోనూ వివాహం చేయనని  ఆ బాలిక తండ్రి నుండి ఒప్పందపత్రం తీసుకుంటారనీ ఆ వార్త సారం . అద్భుతమైన ఆలోచన , అసాధారణమైన ఆచరణ .
    సుమారు దశాబ్ధం క్రితం వ్రాసిన ఓ పాటలోని చరణం – `ప్రతివోడూ ప్రతియేడూ ఒక్క మొక్క నాటి వుంటే , పుట్టే ప్రతిబిడ్డకొక్క మొక్క లెక్క నాటివుంటే ,నేలతల్లి గుండెకింత కోతమిగిలి వుండేదా , సముద్రాల గర్భంలో యేడి రగిలివుండేదా ..’ అని శృతించుకుంటూ ఆ పాట ప్రభావంలో కొన్ని సంవత్సరాల తరువాత కూడా తమ కుమార్తెల మొదటి పుట్టినరోజు వేడుకలలో తిరుగు బహుమతులుగా మొక్కలని కాగితం సంచులలో పెట్టి వచ్చినవారందరికీ అందించిన యిద్దరు  ఆత్మీయ సహచరులని స్మరించుకుంటూ … ఆ ఆంగ్ల  దినపత్రిక లోని వార్తని ఓ మిత్రుడి  ముందుంచాను . కడివెడు నీళ్ళకోసం క్రోసుల దూరాన్ని నడవాల్సొచ్చే రాజస్థాన్ లో ఈ ప్రయోగం ఆహ్వానించదగిన సానుకూల దృక్పథమున్న పరిణామమే కానీ యిరవయి సంవత్సరాల తర్వాతైనా ఆ బాలికలు ఆ సొమ్ముని వారికి నచ్చినట్లు వినియోగపరచుకోగలిగే స్వేచ్చ ఈ దేశంలో వస్తుందంటారా … ? అని ప్రశ్నించాడు ఆర్థికశాస్త్రంలో ఉన్నతపట్టా పొంది సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఆ మిత్రుడు .  ఎగిసిపడిన ఆనందపుటార్ణవ కెరటం  ఒక్కక్షణంలో పడి విరిగింది . మానవుడు ఆశాజీవి అన్న ప్లాటో ని గుర్తుచేసాను . కానీ  అణుబాంబుని కనిపెట్టిన హట్టోహాన్ లా కనిపించిన ఆ మిత్రుడు బాంబ్ పేల్చాడు … రామారావు కి వాళ్ళావిడ  విడాకుల కాగితాలు పంపిందని . మానవ సంబంధాలు హృదయమాధుర్యాలని నమ్మే భావుకతా మూలాలని వదలలేని నేను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెబుతున్న ఆ మిత్రుడి వాస్తవిక ధోరణిని త్రోసిరాజనలేని వాస్తవం , మూడుముళ్ళేసి మూడు సంవత్సరాలు నిండీనిండక విడాకులవరకూ వెళుతున్న రామారావు వైవాహిక వైఫల్య స్థితి .

 ఏడాదిన్నర  క్రితం అనుకుంటా పాప పుట్టిందని రామారావు సహొద్యోగులందరికీ విందు  చేసాడు , కొన్ని నెలల తరువాత వాళ్ళవిడకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చాలా ముక్తసరిగా మొక్కుబడిగా స్వీట్లు పంచాడు . పందొమ్మిదేళ్ళ వయసుకే అతనికో పిల్లని కనిచ్చినందుకు సంతోషించిన రామారావు , అంతచిన్న వయసులో అతనికంటే ముందుగా అతను సాధించలేకపోయిన ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన భార్యని మనస్పూర్తిగా అభినందించలేకపోయాడని అతను తెచ్చి పెట్టుకున్న నవ్వే చెప్పింది . అతనిచ్చిన మిఠాయి చేదుగా అనిపించింది మాటని మనసులో దాచుకోగల నేర్పు నాకు లేదు . ` నా భార్య వయసు నా వయసులో ముప్పాతికకి కొద్దిగా ఎక్కువ , నా జీతం ఆవిడ జీతంలో ముప్పాతిక కంటే తక్కువ , అర్థసత్వాలు అన్యోన్యతకి అవరోధాలు కాకూడదనీ ,భార్య ఉన్నతిని ఆత్మనూన్యతగా భావించవద్దనీ  హాయిగా వుండమనీ  చెప్పాను . కొన్నాళ్ళు బాగానే వున్నారు . ఆ అమ్మాయి తండ్రి విత్తనం నాది కాబట్టి ఆ ఫలాలపై పెత్తనం నాది అన్నట్లుగా ప్రవర్తించాడు .  నా వాకిట్లో చెట్టుపై సర్వాధికారాలు నావికావాలన్నాడు భర్త . ఆ అమ్మాయి రోజూ తండ్రితో కలిసి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేది , రాత్రయేసరికి భర్త యింటికి చేరుకునేది . ఎ టి ఎం కార్డ్ మాత్రం తండ్రి పర్సులో భద్రంగా వుంది . రెండేళ్ళు తిరగకుండా పెళ్ళి పెటాకులదాకా వచ్చింది , పసిపిల్ల భవిత ఓ పవల్లిక . ఆ అమ్మాయి జీతం ఏ మేరకు ఎవరి కొరకు ఖర్చు చేయాలన్న విషయం లో ఆమె ప్రమేయం ఏమీలేదు . ఎప్పుడో ఓ సారి వీరలక్ష్మి గారన్నట్లు నిజంగా ` స్త్రీకి సంపాదించడానికి చాలా స్వేచ్చ వుంది నచ్చినట్లు ఖర్చుచేయడానికి లేదు .

 మరో పదిరోజుల తర్వాత వున్నట్లుండి మా సాంఘిక శాస్త్ర బోధకుడు వున్నపళంగా రెండురోజులు సెలవు కావాలన్నాడు , వాళ్ళావిడ రికార్డ్లు వ్రాసిపెట్టడానికి ఒక రోజు , ఆ రికార్డులకి అవసరమైన ఏభయి రకాల ఆకులు , కొమ్మలు సేకరించడానికి ఒక రోజు . ముచ్చటేసింది . ఆర్థికంగా కొత్తగా కలిగే వెసులుబాటు ఏమీ లేకపోయినా సరే భార్య ఆమెకి యిష్టమైన రంగంలో ఉన్నతిని సాధించడానికి తన సంపూర్ణ సహకారన్నందించే అతడి సంస్కారం ఆ ముచ్చటకి మూలం . ` సాయంత్రం మా యింటికి రండి , మీరు కాఫీ తాగేలోగా ద్రాక్షతో సహా మీకు కావల్సిన అన్ని రకాల ఆకులూ కొమ్మలూ నేనిస్తా’నన్నాను . సాయంత్రం నేనింటికి చేరేసరికి అతడు రాలేదు , అతని నుండి ఫోన్ వచ్చింది ` మీ కంటే ముందే మీ యింటికి వచ్చి కావల్సినవన్నీ కోసుకొచ్చేసాను , మీకు మొక్కలంటే అంతగా ఎందుకిష్టమో అర్ధం కాలేదు సార్ ‘ అని .

 ఓ చిన్న నవ్వే అప్పటి నా సమాధానం ఆ నవ్వుకి అర్ధం :

తమ ఉనికితో అందాన్నీ ఊహతో ఆనందాన్నీ యిస్తూ తాముండే  నేల మీద తాము ఆధారపడినట్లు కనిపిస్తూ నిజానికి ఆ మట్టి గట్టి తనమంతా మట్టిపాలు కాకుండా కాపాడుతాయి దీనినే సోయిల్ ఎరోజన్ అంటారనుకుంటా మీ జాగ్రఫీలో . పవిత్ర సవితృ కిరణతోరణం పత్రహరిత నేత్రాల ధారణం  నేలతల్లి గుండెలలో జీవం నింగి కొసల గాలులతో లీనం కాగా కదిలిన ఆమ్ల జని మానవ జీవన రసధుని అన్నాడయ్యా కవి . అంటే గాలి లో ని కార్బన్ డై ఆక్సైడ్ ని తాముండే నేలలోని నీటితో కలిపి సూర్యరశ్మి సమక్షంలో ప్రాణవాయువు గా చేసి మనకందిస్తాయని . మనకంటే ఎంతో ఉన్నతంగా వున్నా ఆకులతో ఆప్తాలింగనం చేసుకుంటాయి , శిరసు వంచి నమస్కరిస్తాయి , పువ్వులతో పలకరిస్తాయి , తిండిపెడతాయి …

 …అచ్చం స్త్రీమూర్తులలాగానే

తమచుట్టూ ఎన్ని విషవలయాలున్నా విశ్వవ్యాప్తమవుతున్న జ్ఞానాన్నంతటినీ  స్వంతం చేసుకుంటూ తమలో అంతర్లీనమైన వివేకంతో అమృతమయమైన ప్రేమనందిచినట్ట్లు , పుట్టింటిపైనో మెట్టినింటిపైనో ఆధారపడినట్లు కనిపిస్తూ నిజానికి వారికే ఆధారమౌతున్న స్త్రీమూర్తులు మొక్కలలాగే స్వయం సిద్ధలు . కానీ వారి సంస్కారం కారణంగా మనకి మొక్కే దేవతలు నిజానికి మనం మొక్కవలసిన దేవతలు ..అని

అందుకే మొక్కలని విరివిగా పెంచుదాం మహిళలని స్వేచ్చగా ఎదగనిద్దాం!

 శోభాయమానమైన లోకం  కోసం శుభకరమైన జీవితం కోసం  …..

http://vihanga.com/?p=8969

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4 comments:

  1. మీ రచనలు, ఆలోచనలు బాగున్నై సార్.

    ReplyDelete
  2. Good work bro!! Proud of you!!

    ReplyDelete
  3. చాల రోజులు తరవాత ఒక మంచి రచన చదివి ,చాల బాగుంది అనిపించింది

    ReplyDelete